కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో 60 శాతం మున్సిపాలిటీల్లో గెలవడమే తమ లక్ష్యమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు(Ramchander Rao) అన్నారు. మున్సిపల్ ఎన్నికల(municipal elections) నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికలతో బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలపడిందని తెలిపారు. మున్సిపాలిటీలను ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని, ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్పారు. బీజేపీ(BJP) గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొని అభివృద్ధి చేసుకోవచ్చని వెల్లడించారు. ఇప్పటికే బీజేపీ ఈ ఎన్నికలకు సంబంధించి ముగ్గురు ఇంఛార్జ్‌లను నియమించిందని, వారంతా రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్న వాళ్లని పేర్కొన్నారు. ఎన్నికలను ముందుగానే ఊహించి 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు 123 మంది ఇంచార్జ్‌లను నియమించినట్లు తెలిపారు. మరికొద్ది గంటల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. 2,996 డివిజన్లు, వార్డుల్లో బీజేపీ పోటీ చేస్తుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మజ్లిస్ ఓట్ల మీదనే ఆధారపడ్డారని, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అనే విధంగా మారిందని రామచందర్ రావు విమర్శించారు.


