కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర పోలీసులు విధుల నిర్వహణలో సాంకేతికతను మరింత బలంగా వాడుకోబోతున్నారు. సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (సీఏఆర్) సిబ్బంది విధుల కేటాయింపులో ఏఐ విధానానికి (AI for Police Operations) శ్రీకారం చుట్టారు. మానవ ప్రమేయం లేకుండా, పూర్తి పారదర్శకతతో కూడిన అత్యాధునిక విధానానికి శ్రీకారం చుట్టారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనర్ కార్యాలయంలో మంగళవారం సీపీ వీసీ సజ్జనర్ (Sajjanar), ఐపీఎస్ ఉన్నతాధికారులతో కలిసి ఈ నూతన విధానాన్ని ప్రారంభించారు. గతంలో మ్యానువల్ పద్ధతిలో విధుల కేటాయింపు జరిగిదే. దీంతో విధుల్లో జాప్యం జరగడంతో.. సమయం వృథా అయ్యేది. వాటికి చెక్ పెడుతూ.. కేవలం రెండు నెలల్లోనే ఈ కొత్త సాంకేతికతను హన్ష ఈక్విటీ పార్ట్‌నర్స్ ఎల్ఎల్‌పీతో కలిసి పోలీసులు అమలు చేయబోతున్నారు.
ఏఐ వినియోగంతో లాభాలు ఇవే..
‘హంగేరియన్ మెథడ్’ అనే సాంకేతిక పద్ధతి ద్వారా సిబ్బంది సీనియారిటీ, రిజర్వ్‌లో ఉన్న రోజులు, రివార్డులు, క్రమశిక్షణ, ఆరోగ్యం వంటి అంశాలను స్కోర్ ఆధారంగా పరిగణనలోకి తీసుకొని కంప్యూటరే విధులను ఖరారు చేస్తుంది. ఇందులో అధికారుల జోక్యం అస్సలు ఉండదు. ఓపెన్ ఏఐ సాయంతో డ్యూటీ అలాట్‌మెంట్ ఆర్డర్‌లు క్షణాల్లో తయారవుతాయి. దీనివల్ల ఆఫీసు పనిభారం తగ్గి, పోలీసులు శాంతిభద్రతలపై మరింత దృష్టి పెట్టవచ్చు. ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక ‘ఏఐ చాట్ బాట్’ అందుబాటులో ఉంటుంది. డ్యూటీ అలాట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని విషయాలకు చాట్ బాట్ సమాధానం ఇస్తుంది. ఈ విధానం ద్వారా పైలట్ ప్రాజెక్ట్ కింద 1,796 దరఖాస్తులను పరిశీలించి.. సెక్రటేరియట్, సీఎం ఆఫీస్, ట్రాఫిక్ తదితర విభాగాలతో పాటు ఇంటర్‌సెప్టర్ వాహనాలకు సంబంధించిన 208 డ్యూటీలను సమర్థంగా కేటాయించారు.
పారదర్శకంగా విధులు
ఈ విధానంపై (AI for Police Operations) సజ్జనార్ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బందికి విధుల కేటాయింపును పారదర్శకంగా, జవాబుదారీతనంతో మార్చడం కోసమే ఏఐ విధానాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ విధాన రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన హన్ష ఈక్విటీ పార్ట్‌నర్స్ ను అభినందించారు. సాంకేతికత ద్వారా పోస్టింగుల్లో అపోహలకు, అసంతృప్తికి తావులేకుండా చూస్తున్నామని, దీనివల్ల సిబ్బందిపై మానసిక ఒత్తిడి తగ్గి విధుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ విధానాన్ని ప్రతి ఒక్కరు ఈ విధానాన్ని వినియోగించుకుని.. డ్యూటీ అలాట్ మెంట్ ఆర్డర్ లను పొందాలని ఆదేశించారు. సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ కానిస్టేబుళ్లకు జనరేటివ్ ఏఐ విధానం ద్వారా జారీ చేసిన డ్యూటీ అలాట్‌మెంట్ ఆర్డర్లను వారికి అందజేశారు.
Read Also: హార్ట్ టచింగ్ వీడియో.. యజమాని మృతి, 4 రోజులు కాపలా కాసిన కుక్క!
Follow Us On: Pinterest


