epaper
Tuesday, January 27, 2026
spot_img
epaper

17 మున్సిపాలిటీలు.. 6.68 లక్షల ఓటర్లు, ఉమ్మడి నల్లగొండలో ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షే

కలం, నల్లగొండ బ్యూరో: మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) నోటిఫికేషన్ రిలీజైంది. నామినేషన్లు సైతం రేపటి నుంచే కావడంతో పురపోరు హీటెక్కింది. నామినేషన్లకు చివరి గడువు మరో మూడు రోజులే ఉండడం.. ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడం రాజకీయ పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల జాబితా చాంతడంతా ఉండటంతో రెబెల్స్ బెడద పొంచి ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్‌తో‌పాటు 17 మున్సిపాలిటీలు ఉండగా, ఒక్క నకిరేకల్ మున్సిపాలిటీ మినహా మిగతా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆయా నియోజకవర్గాల్లో మున్సిపాలిటీల్లో గెలిచేందుకు ఇప్పటికే అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రధాన పోరు సాగనుంది. కొన్ని మున్సిపాలిటీ వార్డుల్లో బీజేపీ, సీపీఎం పార్టీల ప్రభావం చూపనున్నాయి. కాగా, మున్సిపల్ ఎన్నికలు పార్టీ జెండా గుర్తుపై జరగనున్న నేపథ్యంలో పార్టీల బలాబలాలు తోడవ్వనున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే.. మున్సిపల్ ఎన్నికలు కాస్త డిఫరెంట్‌గా ఉండనున్నాయని చెప్పాలి.

ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో 17 మున్సిపాలిటీల్లో 6.68 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్‌తో‌పాటు మిర్యాలగూడ, చిట్యాల, చండూరు, నందికొండ, హాలియా, దేవరకొండ మున్సిపాలిటీలు ఉండగా, సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, యాదాద్రిభువనగిరి జిల్లాలో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి మండలాలు ఉన్నాయి. ఇకపోతే ఈ మున్సిపాలిటీ పరిధిలో 162 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ వార్డుల్లో సగం సీట్లను మహిళలకు కేటాయించారు. ఇదిలా ఉంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీల పరిధిలో 6,68,455 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 3,23,613 మంది పురుష ఓటర్లు కాగా, 3,44,713 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా విషయానికొస్తే.. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నాలుగైదు నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గట్టిపోటీనిచ్చింది. దీంతో టీపీసీసీ సైతం ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై సిరీయస్ అయ్యింది. అయితే పంచాయతీ ఫలితాలు ఆశాజనకంగా రావడంతో బీఆర్ఎస్ (BRS) క్యాడర్‌లో మంచి జోష్ వచ్చింది. దీంతో అప్పటివరకు అంటిముట్టనట్టుగా తిరిగిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. దీనికితోడు ఈ మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై ఉంటున్న నేపథ్యంలో తమకు కలిసి వస్తుందని మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ క్యాడర్ గంపెడాశలు పెట్టుకుంది.

ఇది ఏ మేరకు ఫలితం ఇస్తుందో చూడాలి. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాపై కాంగ్రెస్ చాలా బలంగా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే.. ఆ జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉండగా, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సమానంగా బీఆర్ఎస్ సీట్లు దక్కించుకుంది. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల్లోనైనా (Municipal Elections) బీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ శ్రేణులు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పురపోరు ఆసక్తికరంగా మారనుంది.

Read Also: తెలంగాణ అసెంబ్లీలో జపాన్​ ప్రతినిధులు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>