కలం, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎక్సైజ్‌శాఖలో 6000 కోట్ల కుంభకోణం (Karnataka Excise Scam) జరిగిందని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను అవమానించారని కూడా వారు ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ఎక్సైజ్ మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు కుంభకోణానికి పాల్పడ్డారని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు. అయితే అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించారు. బీజేపీ, జేడీఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సీబీఐ విచారణకు డిమాండ్
ఎక్సైజ్ కుంభకోణంపై (Karnataka Excise Scam) సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి ఆర్‌బీ తిమ్మాపూర్ ఈ ఆరోపణలకు నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ప్రభుత్వం కుంభకోణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాగా స్పీకర్ సభలో ఈ అంశంపై చర్చకు సమయం ఇస్తామని హామీ ఇవ్వడంతో బీజేపీ నిరసనను ఉపసంహరించుకుంది.
వివాదం ఎక్కడ మొదలైంది?
జాతీయ ఉపాధి హామీ పథకం పేరును జీ-రామ్-జీగా కేంద్రం మార్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీలోనూ ఈ విషయంపైనే గందరగోళం నెలకొన్నది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగంలో జీ-రామ్-జీ పథకానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అయితే ఈ అంశాలను చదివేందుకు గవర్నర్ గెహ్లాట్ నిరాకరించారు. ఆయన అర్ధాంతరంగా సభ నుంచి వెళ్లిపోయారు. తనకు ఇచ్చిన ప్రసంగం కాపీలోని కొన్ని పేరాగ్రాఫ్‌లు జీ-రామ్-జీ పథకానికి వ్యతిరేకంగా ఉన్నాయని గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని తొలగిస్తే తాను ప్రసంగం చదువుతానని చెప్పారు. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఆయన సభ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. మరోవైపు గవర్నర్ తీరును ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా తప్పుపట్టారు. కర్ణాటకలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. గవర్నర్.. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు. జీ-రామ్-జీ అంశంపై చర్చ జరగొద్దని.. ప్రజలకు నిజాలు తెలియొద్దనే ఉద్దేశ్యంతోనే బీజేపీ ఎక్సైజ్ స్కామ్ అంటూ ఆరోపణలు చేస్తున్నదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.


