కలం, తెలంగాణ బ్యూరో : రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌రావుకు (Santhosh Rao) ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసు జారీచేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ఎంక్వయిరీ చేసేందుకు హాజరు కావాల్సిందిగా సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీసులు అందించింది. ఆ నోటీసుల ప్రకారం జనవరి 27 మధ్యాహ్నం 3.00 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో హాజరుకావాల్సి ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జోగినపల్లి సంతోష్ పేరు కూడా పలువురి కన్ఫెషన్ స్టేట్మెంట్లలో రావడంతో ఆయన నుంచి వివరాలు తెలుసుకునేందుకు సిట్ పోలీసులు ఈ నోటీసులు జారీచేశారు. ఇప్పటికే హరీశ్‌రావు, కేటీఆర్‌లు సిట్ ఎదుట హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ సందర్భంగానే సిట్ పోలీసులు తదుపరి పిలుపు కేసీఆర్‌కు ఇస్తారా?.. లేక సంతోష్‌రావుకు ఇస్తారా?.. లేక కల్వకుంట్ల కవితకు ఇస్తారా?.. అనే ఊహాగానాలు వినిపించాయి. దానికి బలం చేకూర్చే విధంగా సంతోష్‌రావుకు సిట్ నోటీసులు జారీచేసింది.
కేసీఆర్ నీడగా సంతోష్‌కు పేరు :
కేసీఆర్‌కు నీడలా ఉన్న జోగినపల్లి సంతోష్ ఆరేండ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ఆదేశాలను సంబంధిత పార్టీ నేతలకు చేరవేసింది సంతోష్రావే అనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలన్నీ సంతోష్ (Santhosh Rao) ద్వారానే పార్టీ నేతలకు, అధికారులకు చేరేవి అనే విమర్శ కూడా ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే విచారణకు హాజరైన పలువురు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ‘పెద్దాయన’ ఆదేశాల మేరకు అంటూ పరోక్షంగా కేసీఆర్ ప్రస్తావన తీసుకురావడంతో ఆయనకు నీడలా ఉన్న జోగినపల్లి సంతోష్‌రావుకు సిట్ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటివరకూ ఏ కేసులోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన పేరు లేనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫస్ట్ టైమ్ పోలీసుల ముందు హాజరవుతున్నారు. ఆయన ఎలాంటి వివరాలను వెల్లడిస్తారు?.. పోలీసులు ఏయే అంశాల్లో ఆయనను ప్రశ్నిస్తారు?.. ఎలాంటి అంశాలపై క్లారిటీ తీసుకుంటారు?.. ఆయన వెల్లడించే అంశాల్లో పోలీసులకు కొత్తది ఏం దొరుకుతుంది?.. ఇలాంటివి ఆసక్తికరంగా మారాయి. ఆయన విచారణ తర్వాత నోటీసులు ఎవరికి అందుతాయనే ఊహాగానాలు మొదలయ్యాయి.
Read Also: బొగ్గుస్కామ్‌పై బీఆర్ఎస్ దూకుడు.. రేపు గవర్నర్‌కు ఫిర్యాదు
Follow Us On: Sharechat



