కలం, వరంగల్ బ్యూరో: పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోమవారం తొర్రూర్ (Thorruru) మున్సిపాలిటీ సన్నాహక సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో కీలక నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించారు. తనను ఆలస్యంగా స్టేజీ మీదకు పిలవడంపై ఓ సీనియర్ నేత మండల నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో పార్టీ ఇన్చార్జి ఝాన్సీరెడ్డిపై తొర్రూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమండ్ల తిరుపతి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలో ఝాన్సీరెడ్డి ఆధిపత్యం శృతి మించుతోందని, పాలకుర్తిలో ఇద్దరు ఎమ్మెల్యేలున్నారా? అని ప్రశ్నిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి (MLA Yashaswini Reddy) విషయంలో ఝాన్సీరెడ్డి జోక్యం ఎక్కువైందని ఆరోపించారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలను, నాయకులను పూర్తిగా పక్కనపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో యశస్విని రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసినవారే.. ఇప్పుడు ఝాన్సీరెడ్డికి అత్యంత సన్నిహితులుగా మారారని తిరుపతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి, ఎమ్మెల్యే ఎదుటనే కీలక నేతలు బహిరంగ ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ విభేదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
Read Also: కాలికి గాయం.. అసలు విషయం చెప్పిన హృతిక్ రోషన్
Follow Us On: X(Twitter)


