కలం, వెబ్ డెస్క్ : భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతున్నా నేటికి కొన్ని ప్రాంతాలు జాతీయ పండుగలకు దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావంతో స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలు అంటే తెలియనివారు కూడా ఉండడం గమనార్హం. ఈ క్రమంలో 77వ రిపబ్లిక్ డే వేళ చరిత్రాత్మక ఘట్టం ఆవిషృతమైంది. చత్తీస్ ఘడ్ బస్తర్ ప్రాంతంలోని 47 మారుమూల గ్రామాల్లో (Bastar Villages) మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. వీటిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన బీజాపూర్, నారాయణపూర్, సుక్మా జిల్లాల్లోని గ్రామాల్లో రిపబ్లిక్ డే (Republic Day) వేడుకలు మొదటిసారిగా జరుపుకున్నారు.
గతంలో మావోయిస్టుల ఆధీనంలో ఉండడంతో ఈ ప్రాంతాల్లో (Bastar Villages) జాతీయ జెండా ఎగురవేయడం, స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలు జరపడం అసాధ్యంగా ఉండేది. 1980 నుంచి బస్తర్ ప్రాంతం నక్సలైట్లకు బలమైన కేంద్రంగా ఉంది. దశాబ్దాలుగా హింస, వలసల కారణంగా ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది. గత 2 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ తో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలోనే బీజాపూర్, నారాయణపూర్, సుక్మా జిల్లాల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గణతంత్ర వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.
నక్సలిజం ప్రభావం తగ్గుతుండడంతో ఈ ప్రాంతాల్లో రోడ్డు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సంఘటన బస్తర్ లో గత 5 దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యలకు ఒక ముగింపుగా కనిపిస్తోంది. ఆపరేషన్ కగార్ అన్నలు అడవిని విడిచి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఇది ఇలానే కొనసాగితే చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల ఉనికి కనపడకపోవచ్చనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఎర్ర జెండా ఎగరాల్సిన చోట జాతీయ పతాకం ఆవిష్కరించడంపై జాతీయ వాదుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.


