కలం, స్పోర్ట్స్ : భారత క్రికెటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) క్రీడా రంగంలో చేసిన విశేష సేవలకు గాను పద్మశ్రీ (Padma Shri) అవార్డుకు ఎంపికయ్యారు. తమ నాయకత్వ ప్రతిభతో భారత క్రికెట్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన ఘనత వీరిద్దరికీ దక్కింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా భారత్‌కు 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అందించారు. బార్బడోస్‌లో ప్రపంచకప్ గెలిచిన తరువాత టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. 2025లో టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ 2027 ప్రపంచకప్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ (Rohit Sharma) 20,109 పరుగులు, 50 శతకాలు, 111 అర్ధ శతకాలు సాధించి భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేశారు.
మహిళల క్రికెట్లో హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) చరిత్ర సృష్టించారు. మహిళల ప్రపంచకప్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా ఆమె గుర్తింపు పొందారు. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆమె నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచింది. ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 260 పరుగులు చేసిన హర్మన్‌ప్రీత్, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఆడిన 89 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టును ఫైనల్‌కు చేర్చారు. నవీ ముంబైలో జరిగిన ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి రికార్డ్ సృష్టించింది.


