కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనపై తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ఆధ్వర్యంలో ఈనెల 29న రౌండ్ టేబుల్ సమావేశం (Round Table Meet) నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) వెల్లడించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర స్ఫూర్తి సంవత్సరం పొడవునా కొనసాగించాలని నాయకులకు సూచించారు. అనంతరం కార్యాలయంలో స్టేట్ బాడీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేంద్రం నిర్వహించే జనగణనలో బీసీల కాలమ్ లేకపోవడం, సబ్ క్యాస్ట్ ను లెక్కించే కాలమ్ లేకపోవడం సహా జనగణనలో ఆయా కులాల డిమాండ్లపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించి కేంద్రానికి నివేదిస్తామన్నారు.
జనగణనలో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలవుతుందని భావించామని కవిత (Kavitha) తెలిపారు. కానీ, జనగణన ఫారమ్‌లో బీసీ అనే కాలమ్ లేదన్నారు. రాష్ట్రంలో మనం బీసీల కోసం కొట్లాడుతూ ఉంటే కేంద్రం మాత్రం బీసీల వివరాలపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న బీసీలను అవమానించడమేనన్నారు. దీనిపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మేధావులతో చర్చించబోతున్నట్లు తెలిపారు. జనవరి 29న నిర్వహించే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు కులాలు, అందులోని ఉప కులాల ప్రతినిధులందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని సంచార జాతులు, ఉపకులాలపై సమగ్రమైన డాక్యుమెంట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తామన్నారు. ఇది జాగృతి చేపట్టబోతున్న అతి పెద్ద కసరత్తు అని, దీని కోసం అందరూ సమాయత్తం కావాలని సూచించారు. బీసీ కాలమ్‌ను పెట్టకపోతే 2011లో కాంగ్రెస్‌లాగా బీజేపీ కూడా మోసం చేసినట్లే అవుతుందన్నారు. రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, దీన్ని సాధించుకోవాలని సూచించారు. దీని కోసం జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Read Also: రిపబ్లిక్ డే వేడుకల్లో మంత్రి.. విరిగిన జెండా కర్ర
Follow Us On: Sharechat


