epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

నల్లగొండలో మేయర్ మేనియా.. ఎవరికివారే బిజీ బిజీ

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda)లో కార్పొరేషన్ మేయర్ మేనియా సాగుతోంది. నోటిఫికేషన్ విడుదల కాలేదు. నామినేషన్ వెలువడలేదు. కానీ ఎవరివారు మేయర్ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. పార్టీల సంగతి పక్కన పెట్టి.. ‘మాకే అభ్యర్థిత్వం ఖరారైంది’ అంటూ కాలనీల్లో గడపగడపకు పలకరింపుల పర్వం మొదలుపెట్టారు. నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ పోరు ఉండబోతుండగా, ఐదారు వార్డుల్లో మాత్రమే బీజేపీ గట్టి పోటీనిచ్చే పరిస్థితి కన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆశావాహులు ఏ పార్టీ నుంచి టికెట్ దక్కితే.. అందులోకి జంప్ చేసేందుకు ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయ పార్టీలు సైతం ఎలాంటి వివాదాలు.. పోటీ లేని డివిజన్లలో మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తూ.. వివాదాస్పద డివిజన్లను వెయిటింగ్ లిస్ట్‌లో పెడుతుండటంతో మరింతగా ఆసక్తిని రేపుతోంది.

నల్లగొండ కార్పొరేషన్ (Nalgonda Corporation) అయిన తర్వాత తొలిసారి మేయర్ (Mayor) ఎన్నిక జరుగుబోతుండటంతో చాలామంది కార్పొరేటర్లుగా ప్రమాణస్వీకారం చేయాలని కలలు కంటున్నారు. దీనికితోడు కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులకు భారీగా నిధులు వస్తాయనే ప్రచారం ఉండడం తీవ్ర పోటీని పెంచుతోంది. ఆశావాహులు మాత్రం ఏ పార్టీ నుంచి టికెట్ దక్కినా.. దక్కకపోయినా పోటీలో ఉండాల్సిందేనని గట్టి నిర్ణయానికి వచ్చారు. అయితే కాంగ్రెస్, లేకుంటే బీఆర్ఎస్, సాధ్యపడకపోతే బీజేపీ నుంచైనా పోటీలో ఉండాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఆయా డివిజన్లలోని కాలనీల్లో పర్యటిస్తూ ఓటర్లను పలకరిస్తున్నారు. గల్లీల్లో తిరుగుతూ పెళ్లిళ్లు, పేరంటాలు, చావులు, దశదినకర్మల పేరుతో సందడి చేసేందుకు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలోనే డివిజన్‌లోని ఓటర్లు ఎంతమంది? వార్డుకు ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది? ఎవరి ఓట్లు పక్కాగా పడతాయి? అనే కోణంలో వ్యుహాలకు మరింత పదును పెడుతున్నారు.

ఎన్నికల్లో ఏ అభ్యర్థికి పట్టం కట్టాలనే విషయంపై జనాలకు ఫుల్ క్లారిటీ ఉంది. నిజంగా ఎవరు ప్రజల్లో ఉన్నారు? ఎవరు ఎన్నికల వరకే పరిమితం అవుతున్నారు? అనే క్లారిటీ స్పష్టంగా ఉంది. అయితే డబ్బున్న లీడర్ల తమ పీఆర్ టీమ్‌లతో సోషల్ మీడియా గ్రూపుల్లో ఆకట్టుకునే ప్రచారాలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే మేయర్ అభ్యర్థి అంటూ రకరకాల వ్యక్తుల పేర్లు విన్పిస్తున్నాయి. ఇటీవల నల్లగొండ పట్టణానికి చెందిన ఓ బడాబాబు కూతురు బీఆర్ఎస్ (BRS) పార్టీ మేయర్ అభ్యర్థి అంటూ పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. అవసరమైతే ఒక్కో డివిజన్‌కు రూ.10 లక్షలైనా ఖర్చు పెట్టుకునేందుకు రెడీ అనే సంకేతాలు పంపుతున్నారు. ఎన్నికల కోసం వచ్చే ప్యారాచూట్ నేతల కంటే క్షేత్రస్థాయిలో ప్రజల తరపున పోరాడే లీడర్ల బెటర్ అనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

Read Also: రైతు చెంతకే ‘భూధార్‌’.. సర్వే వ్యవస్థలో విప్లవం: పొంగులేటి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>