కలం, వెబ్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు వాట్సాప్ గ్రూప్‌లో ఎవరైనా కొత్తగా చేరితే వారికి పాత మెసేజులు కనిపించేవి కాదు. వారు చేరినప్పటి నుంచి మాత్రమే మేసేజులు, ఫొటోలు, వీడియోలు కనిపించేవి. అయితే వాట్సాప్ ఇప్పుడు తీసుకురాబోతున్న కొత్త ఫీచర్‌తో పాత మెసేజులు కూడా కనిపించనున్నాయి.
కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే గ్రూపులో చేరిన వ్యక్తులు 14 రోజుల ముందు మెసేజ్‌లు కూడా చదివే అవకాశం ఉంటుందట. ఈ ఫీచర్‌ను వాట్సాప్ (WhatsApp) టెస్ట్ చేస్తోంది. అయితే ఈ ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరగదు. ఒక గ్రూప్‌లో కొత్త వ్యక్తిని చేర్చినప్పుడు.. ‘పాత చాట్ షేర్ చేయాలా?’ అని ప్రత్యేక ఆప్షన్ వస్తుంది. అడ్మిన్ అనుమతి ఇస్తే గరిష్టంగా 14 రోజుల వరకు 100 సందేశాల వరకు మాత్రమే కొత్త సభ్యుడు చూడగలుగుతాడు.
పాత చాట్‌ను కొత్త సందేశాల నుంచి వేరుగా గుర్తించేందుకు ప్రత్యేకంగా డిస్ ప్లే చేస్తారు. అలాగే ఎవరైతే చాట్ హిస్టరీని షేర్ చేశారో అన్న విషయం గ్రూప్‌లో అందరికీ నోటిఫికేషన్ కూడా వస్తుంది. గోప్యతకు భంగం కలగకుండా ఈ ఫీచర్ కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కిందనే తీసుకొస్తున్నట్టు వాట్సాప్ స్పష్టం చేసింది. పెద్ద గ్రూప్‌లు, ఆఫీస్ లేదా ప్రాజెక్ట్ గ్రూప్‌లలో కొత్తగా చేరే వారికి విషయాలు అర్థం కావడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ ఫీచర్‌ను యూజర్లకు ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయంపై ఇప్పటివరకు వాట్సాప్ అధికారిక ప్రకటన చేయలేదు. బీటా పరీక్షలు పూర్తైన తర్వాత త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం. ఇప్పటివరకు టెలిగ్రామ్ లాంటి యాప్‌లు పూర్తి చాట్ హిస్టరీ చూపిస్తే, సిగ్నల్ యాప్‌లో పరిమితంగా షేర్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వాట్సాప్ కూడా అదే దారిలో కొన్ని నిబంధనలతో ఈ ఫీచర్ తీసుకురాబోతున్నది.
Read Also: మందు తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. నటుడి సలహా
Follow Us On : Pinterest


