ఆసియా సముద్ర ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని బలపరచేందుకు చైనా(China) మరో కీలక అడుగు వేసింది. అమెరికా నావికాదళానికి సమానంగా ఎదగాలనే వ్యూహంలో భాగంగా అత్యంత ఆధునికమైన విమాన వాహక నౌక ఫుజియాన్‌ని అధికారికంగా ప్రారంభించింది. పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ యుద్ధ నౌకను బుధవారం హైనాన్ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రారంభించారు. జిన్‌పింగ్ మాట్లాడుతూ.. చైనా సైన్యానికి ఇది ఒక “వ్యూహాత్మక రక్షణ సంపద” అని పేర్కొన్నారు. దేశ రక్షణలో ఆధునికీకరణలో ఫుజియాన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
316 మీటర్ల పొడవు, 80,000 టన్నుల బరువు కలిగిన ఈ నౌక ఒకేసారి దాదాపు 50 విమానాలను మోసే సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో ఎమాల్స్ అనే విద్యుదయస్కాంత ఆధారిత లాంచ్ వ్యవస్థను ఉపయోగించారు. ఇప్పటివరకు ఈ సాంకేతికతను అమెరికా గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ శ్రేణి విమాన వాహక నౌకల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు.
చైనా(China)కు ఇప్పటికే మూడు విమాన వాహక నౌకలు ఉన్నాయి. లియోనింగ్, షాండాంగ్, ఫుజియాన్. వీటిలో ఫుజియాన్ అత్యాధునికమైనది. బీజింగ్ తదుపరి నౌక టైప్-004 నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈ నౌకలో అణు శక్తి ఆధారిత ప్రోపల్షన్ వ్యవస్థతో పాటు ఎమాల్స్ సాంకేతికతను మరింత అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చైనా సముద్రాధిపత్యానికి తీసుకుంటున్న చర్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటివరకు అమెరికా ఆధిపత్యం ఉన్నప్పటికీ, చైనా సైనిక వ్యూహాలు ఆ సమతౌల్యాన్ని మార్చే దిశగా సాగుతున్నాయి. ఫుజియాన్ ప్రారంభం చైనా నౌకాదళ శక్తి, సాంకేతికతలో స్వతంత్రత, వ్యూహాత్మక వ్యూహాలు అభివృద్ధి చెందుతున్నదనే సంకేతంగా చూడవచ్చు.
ఎమాల్స్ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా చైనా పెద్ద విమానాలను మరింత సమర్థవంతంగా లాంచ్ చేయగల సామర్థ్యాన్ని పొందుతుంది. తదుపరి టైప్-004 యుద్ధ నౌక, అణు సామర్థ్యంతో పాటు అధునాతన ఎమాల్స్ సాంకేతికత కలిగి ఉండటం, భవిష్యత్తులో చైనా–అమెరికా మధ్య సముద్రాధిపత్య పోటీలో కీలక అంశంగా మారే అవకాశం ఉంది.
Read Also: జూబ్లీహిల్స్ బైపోల్ రేవంత్‌కు ఓ అగ్నిపరీక్ష
Follow Us on: Youtube

