కలం, వెబ్ డెస్క్ : బంగారం ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని.. లేదంటే బంగారు ఆభరణాలు (Gold Purchase) కొనాలని చాలా మంది అనుకుంటున్నారు. భవిష్యత్తులో మరింత రేటు పెరగొచ్చని భావిస్తున్నారు. అయితే బంగారం కొనే టైమ్ లో కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేదంటే మోసపోతారు. ఇప్పుడు బంగారం 24 క్యారట్లు, 22 క్యారట్లు, 18 క్యారట్లు, చివరకు 14 క్యారట్లలోనూ మార్కెట్ లో దొరుకుతోంది.
స్వచ్ఛత చాలా ముఖ్యం..
బంగారం కొనేముందు (Gold Purchase) దాని స్వచ్ఛత ఏంటనేది ముందు చెక్ చేయాలి. స్వచ్ఛతను క్యారట్లలోనే కొలుస్తారు. బంగారు ఆభరణాలు ఏవీ 24 క్యారట్లలో ఉండవు. 24 క్యారట్లలో కేవలం కాయిన్లు, బార్లు మాత్రమే ఉంటాయి. మనం కొనే ఆభరణాలు ఇతర క్యారట్లలో ఉంటాయి. 22 క్యారట్ల ఆభరణంలో 91.6 శాతం బంగారం ఉంటే.. మిగతా 8.4 శాతం ఇతర లోహాలు కలిసి ఉంటాయి. 18 క్యారట్ల ఆభరణాల్లో 75 శాతమే బంగారం ఉంటుంది. మిగతా 25 శాతంలో ఇతర లోహాలు ఉంటాయి. 24 క్యారట్ల బంగారంపై 999, 22 క్యారట్ల బంగారంపై 916, 18 క్యారట్ల బంగారంపై 750 అని రాసి ఉంటాయి. ఈ గుర్తులతో మీ బంగారం స్వచ్ఛత గుర్తు పట్టొచ్చు.
ధర తెలుసుకోండి..
రెండోది ఆ రోజు బంగారం ధర తెలుసుకోవాలి. ఆభరణాలు కొనేముందు రెండు లేదా మూడు షాపుల్లో ధర గురించి తెలుసుకోవాలి. అలాగే నమ్మకమైన వెబ్ సైట్లలోనూ చెక్ చేయాలి. లేదంటే షాపువాళ్లు ఎక్కువ ధర చెప్పే అవకాశాలున్నాయి.
హాల్ మార్క్-తయారీ ఛార్జీలు..
మీరు కొనే ప్రతి బంగారు ఆభరణం మీద బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) హాల్ మార్క్ కచ్చితంగా ఉండాలి. ఇది బంగారం స్వచ్ఛతను సూచిస్తుంది. ఈ హాల్ మార్క్ లేని ఆభరణాలను అస్సలు కొనొద్దు. నగలు కొనేటైమ్ లో తయారీ ఛార్జీలు దుకాణాలను, డిజైన్లను బట్టి మారుతూ ఉంటాయి. బంగారాన్ని కాయిన్లలో కొని ఆభరణంగా డిజైన్ చేసినందుకు 8 నుంచి 16 శాతం దాకా అదనపు ఛార్జీలు కొనుగోలు దారుడి నుంచి వసూలు చేస్తారు. కాబట్టి బంగారం ధర మీద తయారీ ఛార్జీలు ఏ షాపులో తక్కువ తీసుకుంటే అందులో కొనుక్కోవాలి.
బంగారం ఎక్కడ కొనాలి..?
బంగారు ఆభరణాలు లేదా నగలు కొనేటైమ్ లో తయారీ ఛార్జీలు, హాల్ మార్కింగ్ ఛార్జీలు, తరుగు లాంటివి వర్తిస్తాయి. కానీ మీరు అమ్మే ఆభరణాలను టైమ్ లో ఇవేవీ తిరిగి రావు. పైగా రాళ్లు ఉన్న నగలను కొనకపోతేనే బెటర్. వీటిలో వేస్టేజ్ ఎక్కువగా పోతుంది. 24 క్యారట్ల బంగారం కొనాలి అనుకుంటే బ్యాంకుల్లో సంప్రదిస్తే బెటర్. చాలా మంది వాళ్లకు తెలిసిన స్వర్ణకారుడి వద్ద లేదంటే దుకాణాల్లో కొంటారు. ఆభరణాలు కాకుండా కాయిన్లు లేదా కడ్డీల్లో బంగారం కొనాలి అనుకుంటే నమ్మకమైన వెబ్ సైట్లు, ఎంఎంటీసీ లాంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుని మాత్రమే నగలు లేదా బంగారం కొనాలి.
Read Also: మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Follow Us On: X(Twitter)


