కలం, వెబ్డెస్క్: వైఎస్సార్సీపీ (YCP) అధికారంలోకి రాకముందు జగన్ తనకు నెం.2 స్థానం ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక పక్కనపెట్టారని రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) అన్నారు. లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు హాజరైన విజయసాయి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉంది. అధికారం కోసం నేను పడిన శ్రమతో వచ్చిన పంటను ఆ కోటరీలోని వ్యక్తులు పందికొక్కుల్లాగా తిన్నారు. ఇప్పటికీ తింటూనే ఉన్నారు. అధికారంలోకి రాకముందు వైఎస్సార్సీపీలో నెం.2 స్థానం ఉండేది. అది కూడా ఏదైనా కేసులు వచ్చినప్పుడే నన్ను నెం.2 అనేవాళ్లు. ఆ తర్వాత అధికారం వచ్చాక లాభంలో నేను వందో స్థానంలో కూడా లేను. కోటరీలోని వ్యక్తులు నాపై లేనిపోనివి చెప్పారు. వేంకటేశ్వర స్వామిపై ఒట్టేసి చెబుతున్నా. అధికారంలోకి వచ్చాక జగన్ నన్ను పక్కన పెట్టారు. కోటరీని నమ్ముకున్నంత వరకూ ఎన్ని పాదయాత్రలు చేసినా వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి రాడు’ అని విజయసాయి అన్నారు.
తాను జగన్ను విమర్శించలేదని, జగనే తనని విమర్శించారని విజయసాయి అన్నారు. ఏడాది పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించాని, ఆ గడువు ఈ నెల25తో ముగుస్తుందని, ఆ తర్వాత తన భవిష్యత్ ప్రణాళిక గురించి వివరిస్తానని చెప్పారు. అయితే, ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. తాను చంద్రబాబు మద్దతుతో పార్టీ పెట్టబోతున్నట్లు ఓ జర్నలిస్ట్ ప్రచారం చేశారని, ఆ జర్నలిస్ట్ వైఎస్సార్సీపీ పేటీఎం అని విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేశారు.
లిక్కర్ స్కామ్ గురించి తెలియదు..
ఈడీ విచారణ గురించి మాట్లాడుతూ.. లిక్కర్ స్కామ్ (Liquor Scam) గురించి తనకు తెలియదన్నారు. అయితే, అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ జవాబిచ్చినట్లు వెల్లడించారు. వాళ్లు కొన్నింటిని మాత్రమే రికార్డు చేశారని అన్నారు. మీరు వైఎస్సార్సీపీలో నెం.2 కదా? అని అడిగారని, అయితే, పార్టీలో నెం.2 అనేది ఉండదని స్వయంగా జగనే చెప్పారనే విషయాన్ని వాళ్లకు వెల్లడించానన్నారు. ‘లిక్కర్ స్కామ్ గురించి జగన్కు (Jagan) తెలియదు. తెలిసింటే ఊరుకోరు’ అని విజయసాయి (Vijayasai Reddy) అన్నారు. లిక్కర్ స్కామ్ బయటపడ్డాకే తాను పార్టీ నుంచి వెళ్లిపోయినట్లు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని చెప్పానన్నారు. అరబిందో బిజినెస్లు తనవి కావని స్పష్టం చేశారు.
Read Also: ఏపీలో క్రెడిట్ చోరీ రాజకీయం.. ఎవరికి లాభం..?
Follow Us On: X(Twitter)


