కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో మణుగూరు నుంచి బీటీపీఎస్ (భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్)కు వెళ్లే రహదారి ప్రమాదకరంగా మారింది. నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు లబోదిబోమంటున్నారు. మణుగూరు నుంచి బీటీపీఎస్ వెళ్ళే మార్గంలో మూడు ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ఇక్కడ్నుంచి ప్రతినిత్యం వందల ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీలు ఇసుకను తరలిస్తుంటాయి. బొగ్గు లారీలు కూడా ఇదే దారిలో రాకపోకలు కొనసాగిస్తాయి. దీంతో రోడ్డు గుంతలమయవుతోంది. కంకర తేలి దుమ్మురేగుతోంది.
నిత్యం వాహనాల రద్దీ కారణంగా వారానికి రెండు, మూడు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ మార్గంలో ప్రయాణమంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. ప్రస్తుతం మేడారం జాతర సీజన్ నడుస్తుండటంతో రాకపోకలు మరింత పెరిగాయి. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు నుంచి మేడారం వెళ్ళే భక్తులు ఇదే రోడ్డు మీద వెళ్లాల్సి ఉంటుంది. ఒకవైపు ట్రాఫిక్, మరోవైపు ప్రమాదాలతో (Accidents) నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సమయంలోనైనా సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

Read Also: పురుషః నుంచి వెన్నెల కిషోర్ పోస్టర్ రిలీజ్..
Follow Us On: Pinterest


