కలం, వెబ్‌డెస్క్: జనవరి 18, 2026.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కస్తూరిపాడు అటవీ ప్రాంతంలోని ఓ గ్రామం. అడవి నుంచి కట్టెలు తెచ్చుకొనేందుకు బయలుదేరాడు స్థానికుడు కుర్సం ఐత. ఊరి నుంచి కాలిబాటలో కాస్త దూరం వెళ్లాడో లేదో అడుగు పెట్టినచోట ప్రెజర్ బాంబు పేలింది. అంతే.. ఒక కాలు పూర్తిగా తెగిపడింది. ఐత తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సంఘటనతో గ్రామం ఉలికిపడింది. ‘అన్న’లు వెళ్లిపోయినా.. అడవిలో వాళ్ల ఆనవాళ్లు ప్రమాదాల రూపంలో పొంచి ఉన్నాయని అర్థమైంది.
మార్చి 31, 2026.. దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు కేంద్రం నిర్దేశించుకున్న గడువు. ఆ లక్ష్యం కోసం పెట్టుకున్న పేరు ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar). అడవులను నయానో భయానో మావోయిస్టుల నుంచి విముక్తి చేయడం కోసం ఈ ఆపరేషన్లోకి దిగాయి సాయుధ దళాలు. అంతే.. ఒక పక్క ఎన్కౌంటర్లు, మరోపక్క లొంగుబాట్లు. 2024లో ప్రారంభమైన ఆపరేషన్ కగార్.. గడువు ముగింపు దశకు వచ్చేస్తోంది. అడవి నక్సలైట్ల రహితం అవుతోంది. మరి, వాళ్లు పాతిన బాంబులు, దాచిన ఆయుధాల సంగతేంటి?
అత్యాధునిక ఆయుధాలు..
నక్సల్బరీ కేంద్రంగా 1980 దశకంలో ప్రారంభమైంది మావోయిస్టు ఉద్యమం. తదనంతరం మావోయిస్టులు కాలంతోపాటు పోరాట మార్గం మార్చుకున్నారు. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకున్నారు. అందుకు నిదర్శనం.. ఎన్నోసార్లు కూంబింగ్‌లో బయటపడిన డంప్‌లు, ఎన్కౌంటర్లలో దొరికిన మోడరన్ వెపన్స్.
ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల్లోని అడవులతో మావోయిస్టులు ఏర్పాటుచేసుకున్న సామ్రాజ్యంలో అనేకసార్లు ఆయుధ డంప్‌లు బయటపడ్డాయి. వీటిని చూసి పోలీసులే కాదు.. ఆపరేషన్ కగార్ (Operation Kagar)లో పాల్గొంటున్న సాయుధ దళాలు సైతం ఆశ్చర్యపోయాయి. ముఖ్యంగా చత్తీస్‌గఢ్, ఐవోబీ ఏరియాల్లో స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో అనేకం బంగ్లాదేశ్, నేపాల్ నుంచి వచ్చినవేనని గుర్తించారు. మయన్మార్, నేపాల్, మణిపూర్ మార్గంలో ఇవన్నీ వచ్చినట్లు కనుగొన్నారు. వీటిని నక్సలైట్లకు చేర్చడంలో అర్బన్ మావోయిస్టులు ప్రధాన పాత్ర పోషించారని తేల్చారు. అలాగే ఉగ్రవాదులతో సంబంధం ఉండే స్మగ్లర్లు, డీలర్లు సైతం ఆయుధ సరఫరాలో కీలకంగా వ్యవహరించారు.
కొన్నేళ్లుగా పోలీసులకు, ఇటీవల సాయుధ బలగాలకు దొరికిన వాటిలో విదేశాల్లో తయారైనవీ ఉండడం గమనార్హం. రష్యా, చైనా తయారీ గ్రెనేడ్లు, గ్రెనేడ్ లాంఛర్లు, ఏకే–47లు ఉన్నాయి. అంతేకాదు, పాక్ ఆర్మీ ఉపయోగించే హెక్లెర్, కోచ్ జీ3 రైఫిల్స్ సైతం పట్టుబడ్డాయి. అలాగే, అమెరికా తయారీ మెషిన్ గన్లు, జర్మనీ రైఫిల్లు భద్రతా దళాలకు దొరికాయి. ఆయుధాల తయారీకి వాడే లేత్‌మిషన్లు, గ్యాస్ వెల్డింగ్ సిలిండర్లు, బాంబుల్లో వాడే రకరకాల ఇనుపముక్కలు, గాజుపెంకులు వంటివీ లభ్యమయ్యాయి.
ఆ ప్రాంతాల్లో డంప్‌లు..
నక్సలైట్లకు మొదటి నుంచి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా ప్రాంతాలు అత్యంత కీలకం. అందులో కర్రెగుట్ట, అబూజ్ మఢ్, ఆంధ్రా–ఒడిశా బోర్డర్లో చాలా ప్రాంతాలను ఆయుధాల డంప్‌లు దాచడానికి వాడుకున్నారు. అలాగే తమ ఆధీనంలోని అటవీ ప్రాంతాల్లో మందుపాతరలు అమర్చారు. భూమిలో స్టీల్ బకెట్లలో వేల సంఖ్యలో తూటాలు, డిటోనేటర్లు పెట్టారు. అత్యంత తీవ్రత కలిగిన ఐఈడీ బాంబులు సైతం నక్సల్స్ దగ్గర ఉన్నాయి. కానీ, ప్రస్తుతం ఎన్కౌంటర్లలో సాయుధ బలగాలు, పోలీసులకు దొరుకుతున్నవి కేవలం కొన్ని మాత్రమే. అలాగే లొంగిపోతున్న నక్సలైట్లు అందజేస్తున్న ఆయుధాల సంఖ్య సైతం తక్కువగానే ఉంటోంది. ఈ క్రమంలో దాచిపెట్టిన ఆయుధ డంప్‌లు, మందుపాతరలు, అత్యాధునిక ఆయుధాలను గుర్తించడం, స్వాధీనం చేసుకోవడం భద్రతా దళాలకు సవాలే.
మిగిలింది కొందరే..
ఆపరేషన్ కగార్ (Operation Kagar) మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు వందల మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఒక్క తెలంగాణలోనే గత రెండేళ్లలో 576 మంది లొంగిపోయినట్లు ఆ రాష్ట్ర డీజీపీ వెల్లడించారు. ఇక తెలంగాణ తరఫున మిగిలింది కేవలం 17 మంది మాత్రమేనని, వాళ్లనూ లొంగిపోవాలని కోరుతున్నట్లు చెప్పారు. కాగా, రెండేళ్లలో మోస్ట్ వాంటెడ్ హిడ్మాతో సహా 15 మంది అగ్రనాయకులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. మొత్తమ్మీద 2024లో 290 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోగా, 2025లోదాదాపు 400 మంది మృతి చెందారు. అలాగే రెండేళ్లలో 2వేల మంది వరకు అరెస్టు కాగా, సుమారు 3వేల మంది లొంగిపోయారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 126 నుంచి 3కు తగ్గాయి.


