కలం, వెబ్‌డెస్క్: అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు గుడ్‌న్యూస్. అటల్ పెన్షన్ యోజన పథకాన్ని(Atal Pension Yojana) కేంద్రం పొడిగించింది. ఈ పథకం మరో ఐదేళ్ల (2030–31) వరకు కొనసాగనుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. అలాగే ఈ పథకం ప్రయోజనాల గురించి విస్తృత ప్రచారం, అభివృద్ధికి మరింత ఖర్చు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన భేటీలో నిర్ణయించారు. ఏపీవై పథకం కింద ప్రస్తుతం 8.66 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. ఈ పథకం గడువు పొడిగింపుతో మరింత మందికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత జీవితం గడవడానికి నెల నెల పెన్షన్ అందుతుంది. దీని వల్ల సదరు రిటైర్డ్ ఉద్యోగికి, అతని కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, అసంఘటిత రంగంలో పనిచేసేవాళ్లకు ఇలాంటి పెన్షన్ పథకమేదీ లేదు. దీంతో వీళ్ల కోసం కేంద్రం 2015లో తీసుకొచ్చిన పథకమే అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana). ఈ పథకం కింద నెలకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు పెన్షన్ అందుతుంది.
ఈ పథకంలో 18 నుంచి 40 ఏళ్ల లోపు వాళ్లు చేరవచ్చు. వీళ్లు నెల నెల కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. వీళ్లకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలవారీ పెన్షన్ అందుతుంది. ఈ పథకంలో చేరడం కోసం పోస్టాఫీస్ లేదా ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో అకౌంట్ ఉండాలి. కేంద్ర, రాష్ట్రాల పెన్షన్ స్కీమ్‌లో ఉన్నవాళ్లు, లేదా ఇన్‌కమ్‌టాక్స్ కట్టేవాళ్లకు ఈ పథకం వర్తించదు.
ఈ పథకంలో చేరేవాళ్లకు వయసును బట్టి నెలవారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అంటే 18 ఏళ్ల లోపు వాళ్లైతే.. నెలకు రూ.42 నుంచి రూ.210 వరకు; అదే 40 ఏళ్ల తర్వాత చేరితే రూ.291 నుంచి రూ.1,454 వరకు చెల్లించాల్సి ఉంటుంది.


