కలం, వరంగల్ బ్యూరో : మేడారంలో మహాజాతర (Medaram Jatara) మొదటి ఘట్టానికి ఘడియలు మొదలయ్యాయి. వనదేవతలు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజులకు ఆదివాసీ పూజారులు బుధవారం మండమెలిగె పండుగ (Mandamelige festival) ను ఘనంగా నిర్వహించనున్నారు. పూజారులు, కుటుంబీకులు వేకువ జామునే నిద్ర లేచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకుంటారు. అనంతరం కుటుంబ సభ్యులతో సహా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
గ్రామంలోని సమ్మక్క గుడికి చెందిన సిద్దబోయిన, కొక్కెర, మల్యాల, దోబె వంశీయులు, కన్నెపల్లిలోని సారలమ్మ గుడికి చెందిన కాక వంశీయులు, పూనుగుండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు గుడిలో పెనుక, కొండాయి గ్రామంలోని గోవిందరాజు గుడిలో దబ్బకట్ల వంశీయులు దేవతల పీఠలను కడిగి అలికి ముగ్గులు వేస్తారు. అనంతరం అమ్మవారి పూజాసామగ్రి ముత్తైదువులు (మువ్వలు,గంటలు,వస్త్రాలు) శుద్ది చేస్తారు.
మండమెలిగే పండుగ (Mandamelige festival) తో కోయ రాజ్యంలో ఎలాంటి దుష్ట శక్తుల ప్రభావం ఉండకుండా చూడటమే లక్ష్యంగా పూజలు చేస్తారు. వెదురు బొంగు, ముల్ల కర్రలకు మామిడాకు కట్టి కన్నెపల్లి సారలమ్మ ఆలయం నుండి మేడారం వరకు పచ్చని తోరణాలను కట్టి అలంకరిస్తారు. మద్యాహ్నం పూజారులు సారలమ్మ గుడి నుండి పూజా సామగ్రిని మేడారం సమ్మక్క గద్దె వరకు చేరుకుంటారు.
అమ్మవారి గద్దెలపై అలంకరించి రాత్రంత డోలు వాయిద్యాలతో కొలుచుకుంటూ జాగారం చేస్తారు. మరుసటిరోజు (గురువారం) సారలమ్మ గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి సారలమ్మ వారికి కోయ సంప్రదాయాల ప్రకారం మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో రెండు రోజులు మేడారంలో పండుగ వాతావరణం నెలకొననుంది. ఈ వేడుకకు భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసు అధికార యంత్రాంగం బందోబస్త్ చర్యలు చేపట్టింది.


