కలం, నిజామాబాద్ బ్యూరో : ఆన్లైన్ మోసాల(Online Fraud)తో నష్టపోయి, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. నిజామాబాద్(Nizamabad) జిల్లాలో తాజాగా ఆన్లైన్ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. ఆన్ లైన్ గేమ్‌ల వ్యవసనంతో మితిమీరిన అప్పులు చేసిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందల్వాయి-సిర్నాపల్లి రైల్వేస్టేషన్ల మధ్య పట్టాల పక్కన సదరు యువకుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడ్ని నల్లవెల్లికి చెందిన సాయిలు, రాజమణి దంపతుల కుమారుడు అనిల్(29)గా గుర్తించారు. అప్పులు పెరిగిపోతుండటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనిల్ మూడేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లి అక్కడ నుంచి మళ్లీ స్వగ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. కొన్ని నెలల క్రితం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆన్లైన్ ప్రకటనలు చూశాడు. రూ.7 లక్షలు పంపిస్తే రూ.16 లక్షలు పంపిస్తామని చెప్పడంతో సొసైటీలో అప్పు చేసి సైబర్ నేరగాళ్ల అకౌంట్లో వేశాడు. తర్వాత అక్కడ నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి ఇందల్వాయి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆపై వరుసగా ఒక అప్పును తీర్చడానికి మరో చోట అప్పు చేస్తూ అప్పులపాలయ్యాడు. ఇక అప్పులు తీర్చే మార్గం లేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు అనిల్ కోసం ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం గ్రామశివారులోని రైల్వే పట్టాలపై అనిల్ విగత జీవిగా పడి ఉన్నాడు. అనిల్ ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆన్ లైన్ గేమ్‌లు, లోన్ యాప్‌లు, బెట్టింగ్ యాప్ లను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.


