కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో ఏ ఇంటి తలుపు తట్టినా ఒక పోరాట గాథ వినిపిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) తెలిపారు. మంగళవారం ఆయన ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐ శత వసంతాల సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్ లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలకులు బూర్గుల రామకృష్ణారావు 1950లో కౌలుదారి చట్టాన్ని తీసుకువచ్చారనీ, ఆ తర్వాత 1970లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం, పేదల అభివృద్ధికి 20 సూత్రాల పథకం వంటి గొప్ప చట్టాలను వామపక్ష పార్టీల సహాయంతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దేశంలో, రాష్ట్రంలో తీసుకురాగలిగాయి అన్నారు.
ఖమ్మం జిల్లా అనేక రకాల భావజాలాల వ్యాప్తికి ఆహ్వానం పలుకుతుంది, ఆతిథ్యానికి మారుపేరు ఖమ్మం, దేశవ్యాప్తంగా ఉన్న వామపక్షా నేతలు ఖమ్మం జిల్లాలో సమావేశం కావడాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని, అభినందిస్తున్నానని తెలిపారు. 100 సంవత్సరాల సిపిఐ చరిత్రలో ఎన్నో త్యాగాలు, ఆటుపోట్లు ఉన్నాయి ఈ దేశానికి స్వాతంత్రం సాధించడంలో సిపిఐది ప్రముఖస్థానం అన్నారు.
భారతదేశం అంతటికీ 1947లో స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతానికి ఒక సంవత్సరం తర్వాత స్వాతంత్రం సిద్ధించిందన్నారు. నిరంకుశ నిజాం రాజును వ్యతిరేకించి కమ్యూనిస్టులు చేసిన సాయుధ పోరాటం ప్రపంచానికి కొత్త సందేశాన్ని ఇచ్చింది అని వివరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓటు హక్కును నాశనం చేస్తుంది, రాజ్యాంగంలో మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి ఈ దేశంలో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) గుర్తు చేశారు.


