కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి హరీశ్ రావు సిట్ విచారణ ముగిసింది. అనంతరం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సిట్ విచారణ అంతా ఉత్త కేసే అని చెప్పారు హరీశ్ రావు (Harish Rao). సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే ఇలా కక్షసాధింపు విచారణలు చేయిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి. ‘సీఎం రేవంత్ రెడ్డికి ధైర్యముంటే సింగరేణిలో బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. మా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి ఇందులో ప్రధాన లబ్దిదారుడు’ అంటూ ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు.
ఆ ముగ్గురి మధ్య వాటాల గొడవ..
సృజన్ రెడ్డి బొగ్గు కుంభకోణాన్ని (Singareni Scam) తాను ఉదయం బయటపెడితే.. సాయంత్రానికి సిట్ తో కక్షపూరితంగా నోటీసులు ఇప్పించారని మండిపడ్డారు హరీశ్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి సిట్ లు వేస్తోందన్నారు. ‘సీఎం రేవంత్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి మధ్య టెండర్ల వాటాల పంపకం రోడ్డు మీదకొచ్చింది. వాటినుంచి డైవర్ట్ చేయడానికే సిట్ పేరుతో విచారణకు పిలిపించారు. మాకు చట్టం మీద గౌరవం ఉంది. ఎన్ని సార్లు పిలిచినా విచారణకు వస్తాను. కాంగ్రెస్ నేతల్లాగా సిట్ నోటీసులు ఇస్తే పారిపోయే వ్యక్తిని కాదు. ఇలాంటి అక్రమ కేసులు గతంలో ఎన్నో చూశాం. ఇవేం కొత్త కాదు. సిట్ ఇచ్చిన నోటీసులు నాకు గౌరవంగా భావిస్తున్నా. ఉదయం నేను సీఎం రేవంత్ బావమరిది బొగ్గు కుంభకోణం బయటపెడితే.. సాయంత్రం నాకు నోటీసులు ఇచ్చారంటే.. నా ఆరోపణల్లో నిజం ఉన్నట్టే కదా’ అంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి హరీశ్ రావు.
గతంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తనను ప్రైవేట్ కేసులో ఇరికించాలని చూశారని.. అందుకోసం కోట్లు ఖర్చుచేసి సుప్రీం లాయర్లను పెట్టి కుట్ర చేస్తే కోర్టులు ఆ కేసును కొట్టేసినట్టు హరీశ్ చెప్పుకొచ్చారు. ఆ కేసు వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు మరో కేసులో ఇరికించాని సీఎం రేవంత్ చూస్తున్నారని హరీశ్ ఆరోపించారు. సీఎంను తాను ఏం ప్రశ్నించినా ఏదో ఒక పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టిస్తున్నారని.. ఎవరో ట్వీట్ చేస్తే తన మీద హైదరాబాద్ లో కేసు పెట్టించారని చెప్పారు. ఇలాంటి సిట్టు.. లట్టు.. పొట్టు ఎన్ని వేసినా తనను ఏం చేయలేవన్నారు.
కొద్ది సేపట్లో విచారణకు సంబంధించి ఏదో ఒక లీక్ ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తారని.. అవన్నీ కాకుండా దమ్ముంటే సిట్ విచారించిన వీడియోను బయటపెట్టాలని హరీశ్ డిమాండ్ చేశారు. సిట్ అధికారులు ఏం ప్రశ్నలు అడిగారో.. తాను ఏం సమాధానాలు చెప్పానో వీడియో చూస్తే అందరికీ తెలుస్తుందన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు కాకుండా ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao).
Read Also: ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు : మంత్రి వివేక్
Follow Us On: X(Twitter)


