కలం, వెబ్ డెస్క్: వివేకా హత్యకేసుకు (Viveka Murder Case) సంబంధించిన దర్యాప్తుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా? అంటూ ప్రశ్నించింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా వివేకా హత్య కేసు విచారణ విషయంలో సీబీఐ వైఖరి ఏమిటో స్పష్టంగా తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే తమ వైఖరిని తెలియజేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
విచారణ సమయంలో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘ఇంకెంతకాలం ఈ కేసులో (Viveka Murder Case) దర్యాప్తు కొనసాగించాలనుకుంటున్నారు? మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించాలనే ఉద్దేశ్యం ఉందా? ఇలా సాగితే కేసు పూర్తి కావడానికి మరో పదేళ్లు పడుతుంది’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును లాజికల్ ఎండ్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ భావిస్తే కేసును క్లోజ్ చేయాలని సూచించింది. అదే సమయంలో తదుపరి దర్యాప్తు కావాలనుకుంటే అది ఎంతవరకు అవసరమో స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించింది. తదుపరి దర్యాప్తునకు అనుమతి ఇస్తే బెయిల్‌పై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అన్ని అంశాలను సమతుల్యం చేస్తూ సీబీఐ వైఖరి ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


