కలం, వెబ్ డెస్క్ : కేరళ బస్సుల్లో మగవారు అట్టపెట్టెలు పెట్టుకుని ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడు రోజుల క్రితం కేరళలో (Kerala) ఓ సంచలన ఘటన జరిగింది. కోజికోడ్ కు చెందిన దీపక్ (42) బస్సులో ప్రయాణిస్తుండగా.. అదే బస్సులో ప్రయాణిస్తున్న వడకరకు చెందిన షిమ్జిత ముస్తఫా(35) వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఆ వీడియోలో దీపక్ కు దగ్గరగా ఆమె మెదులుతూ.. తనను అసభ్యకరంగా తాకాడంటూ ఆరోపించింది. వీడియో వైరల్ కావడంతో.. తన పరువు పోయిందని మనస్తాపానికి గురైన దీపక్ నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఇప్పటికే సదరు యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో కేరళ (Kerala) బస్సుల్లో కొందరు మగవారు అట్టపెట్టెలు అడ్డుపెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులే కాదు.. పురుష కండక్టర్లు కూడా అట్టపెట్టెలు కట్టుకుని బస్సుల్లో వెళ్తున్నారు. ఆడవారు పొరపాటున తాకినా తమ తప్పు లేదని చెప్పుకోడానికి ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బస్సుల్లో రద్దీగా ఉన్నప్పుడు ఒకరికి ఒకరు తాకితే అదెలా లైంగిక వేధింపుల కిందకు వస్తుందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. కేరళ బస్సు వీడియోలో దీపక్ తప్పు కనిపించట్లేదని.. షిమ్జిత కావాలనే అతని దగ్గరకు జరుగుతూ వీడియో క్రియేట్ చేసినట్టు కనిపిస్తోందంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించి పూర్తి నివేదిక అందించాలని పోలీసులను ఆదేశించింది. షిమ్జిత ప్రస్తుతం పరారీలో ఉందని.. ఆమె కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఆమెను విచారిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయంటున్నారు.


