కలం, నల్లగొండ బ్యూరో : రుణమాఫీ (Farmer Loan Waiver) చేయలేదంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన రైతాంగం హైకోర్టు (High Court)ను ఆశ్రయించింది. దీనిపై విచారించిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అసలు విషయంలోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లికి చెందిన బద్దం నరసింహారెడ్డి అనే రైతు అరూరు గ్రామంలోని కెనరా బ్యాంకులో తనకు ఉన్న వ్యవసాయ భూమిపై రూ.1.50 లక్షల రుణం తీసుకున్నారు. అయితే ఎన్నికల హామీల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రూ.2 లక్షల లోపు ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్టు జీఓ నంబరు 567ను విడుదల చేసింది.
కానీ తనకు మాత్రం రుణమాఫీ (Farmer Loan Waiver) కాలేదంటూ రైతు నరసింహారెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేసింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని రాష్ట్ర సర్కారు తరపు న్యాయవాది కోరడంతో తెలంగాణ హైకోర్టు సదరు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ఇదే తరహాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మరికొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఈ పిటిషన్ ఈనెల 6వ తేదీన వేసినప్పటికీ ప్రస్తుతం ఆ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: పదవుల కంటే ప్రజా సేవకే ప్రాధాన్యం: ప్రధాని మోదీ
Follow Us On : WhatsApp


