కలమ్ వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేడు విశాఖపట్నానికి (Visakhapatnam) రానున్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (Parliamentary Standing Committee) సభ్యుల రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ విశాఖకు వస్తున్నారు. రాహుల్ గాంధీ ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. మంగళవారం, బుధవారం రెండు రోజులు జరుగనున్న ఈ పర్యటనకు ఎంపీ రాధామోహన్ సింగ్ కమిటీ చైర్మన్‌గా నేతృత్వం వహిస్తున్నారు. మొత్తం 9 మంది సభ్యులతో కూడిన ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో రాహుల్ గాంధీతో పాటు జగదీష్ శెట్టర్, మహమ్మద్ హనీఫా తదితరులు సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులు నిన్న రాత్రి బెంగళూరు నుంచి విశాఖకు చేరుకున్నారు. ఈరోజు కమిటీ సభ్యులు నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ (NSTL)ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా డీఆర్డీవోకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు, పరిశోధన కార్యక్రమాలపై అధికారులతో చర్చిస్తారు. జాతీయ రక్షణ రంగంలో జరుగుతున్న సాంకేతిక అభివృద్ధిపై సమీక్ష చేయనున్నారు.
ఈ కమిటీ బుధవారం కోస్ట్ గార్డ్ కేంద్రాన్ని సందర్శించనుంది. తీరప్రాంత రక్షణలో కోస్ట్ గార్డ్ పాత్ర, భద్రతా చర్యలు, భవిష్యత్తు సవాళ్లపై విస్తృతంగా చర్చించనున్నారు. ఈ పర్యటన ద్వారా దేశ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిటీ అధ్యయనం చేపట్టినట్లు సమాచారం. పదేళ్ల క్రితం రాహుల్ హుద్ హుద్ తుఫాన్ విపత్తు సమయంలో విశాఖలో పర్యటించారు. ఇన్నేళ్ల తర్వాత రాహుల్ విశాఖకు వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


