కలం, వెబ్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు (Raj Kundra) బిట్ కాయిన్ స్కామ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఏ (PMLA) కోర్టు సోమవారం ఆయనకు సమన్లు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, ఈ కేసులో రాజ్ కుంద్రాతోపాటు దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజేష్ సతీజాను కూడా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
ఏమిటీ బిట్ కాయిన్ కేసు?
‘గెయిన్ బిట్‌కాయిన్ (GainBitcoin)’ క్రిప్టో స్కామ్ ద్వారా రాజ్ కుంద్రా (Raj Kundra) దేశవ్యాప్తంగా వేలాది మంది పెట్టుబడిదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2016–17 మధ్యకాలంలో ‘గెయిన్ బిట్‌కాయిన్’ పేరిట క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం వరకు లాభాలు వస్తాయని రాజ్ కుంద్రా పెట్టుబడిదారులను ఆకర్షించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఈ స్కీమ్ ద్వారా భారీగా ఆర్థిక అవకతవకలు జరిగి ఉండొచ్చని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ అంచనా వేస్తున్నాయి. ఈ కేసులో రాజ్ కుంద్రాకు సంబంధించిన కొన్ని కంపెనీలు, వ్యాపార లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. బిట్‌కాయిన్ మైనింగ్, ట్రేడింగ్‌కు సంబంధించిన లావాదేవీల్లో ఆయనకు సంబంధం ఉందని, క్రిప్టో ఆస్తులను ఇతర రూపంలోకి మార్చడంలో పాత్ర ఉండొచ్చన్న కోణంలో ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రాకు చెందిన కొన్ని ఆస్తులు, బ్యాంక్ ఖాతాలపై అటాచ్‌మెంట్ చర్యలు కూడా చేపట్టినట్లు సమాచారం.
అయితే, రాజ్ కుంద్రా ఈ ఆరోపణలను ఖండించారు. తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని, సాధారణ వ్యాపార లావాదేవీలే జరిగాయని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడిదారులను మోసం చేసే ఉద్దేశం తనకు లేదని పలుమార్లు వెల్లడించారు. ఈ స్కామ్‌లో మాస్టర్‌మైండ్ అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా సుమారు 285 బిట్‌కాయిన్లను అందుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్ ఏర్పాటు చేసే ఒప్పందంలో భాగంగా ఈ లావాదేవీ జరిగినట్లు తెలుస్తోంది. ఆనాడు కుంద్రా తీసుకున్న 285 బిట్‌కాయిన్ల ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 150 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ ఒప్పందం విఫలమైనప్పటికీ, ఆ బిట్‌కాయిన్లు ఇప్పటికీ రాజ్ కుంద్రా వద్దే ఉన్నాయని.. ఆయన వాటి ద్వారా లబ్ధి పొందారని ఈడీ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది.
నేను మధ్యవర్తిని మాత్రమే..
తాను ఈ డీల్‌లో కేవం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరించానని రాజ్ కుంద్రా వాదిస్తున్నారు. అయితే, అందుకు తగిన ఆధారాలు చూపడంలో ఆయన విఫలమయ్యారని ఈడీ తెలిపింది. ఆ బిట్‌కాయిన్లను ఏ వాలెట్ అడ్రస్‌లకు బదిలీ చేశారో చెప్పాలని కోరగా, తన ఐఫోన్ ఎక్స్ పాడైపోయిందని, అందుకే వివరాలు లేవని కుంద్రా బదులిచ్చారు. ఇది ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలను ధ్వంసం చేయడమేనని, నేరం ద్వారా పొందిన డబ్బును దాచే ప్రయత్నమని ఈడీ కోర్టుకు వెల్లడించింది. ఏడేళ్లు గడిచినప్పటికీ ఐదు విడతల్లో తనకు అందిన బిట్‌కాయిన్ల సంఖ్యను రాజ్ కుంద్రా కచ్చితంగా గుర్తుంచుకోవడాన్ని బట్టి, ఆయనే అసలైన లబ్ధిదారుడని ఈడీ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానం సమన్లు జారీ చేస్తూ, నిందితులు కోర్టులో హాజరై తమ వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
Read Also: మహిళలతో కర్ణాటక డీజీపీ అసభ్య ప్రవర్తన.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
Follow Us On: X(Twitter)


