కలం, వెబ్ డెస్క్: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) కవిత కొత్తగా పెట్టబోయే పార్టీకి గైడెన్స్ ఇవ్వబోతున్నారా? నేరుగా వ్యూహకర్తగా ఉండకపోయినా సలహాలు, సూచనలు ఇస్తూ మార్గదర్శనం చేయబోతున్నారా? ప్రస్తుతం కవిత సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ కిశోర్.. కవితకు రాజకీయ సలహాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తున్నది.
కొత్త పార్టీ కోసం కవిత వ్యూహాలు
జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయపార్టీ స్థాపించబోతున్న విషయం తెలిసిందే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారం కల్పించడమే తన లక్ష్యమంటూ ఆమె ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం సంక్రాంతి సెలవుల్లో ఉన్న కవిత కొత్త రాజకీయపార్టీకి సంబంధించిన సమాలోచనలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కవిత పెట్టబోయే రాజకీయ పార్టీకి ప్రముఖ రాజకీయ వ్యహకర్త, ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ గైడెన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తున్నది. నిజానికి ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) తాను ఇక రాజకీయ వ్యూహకర్తగా పనిచేయబోనని ఇప్పటికే ప్రకటించారు. ఆయన స్థాపించిన ఐప్యాక్ సంస్థ మాత్రం వివిధ రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నది. ఇక ప్రశాంత్ కిశోర్ జన్‌సురాజ్ అనే పార్టీని స్థాపించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తన అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. గత రెండు నెలల వ్యవధిలో కల్వకుంట్ల కవితతో ప్రశాంత్ కిషోర్ రెండు సార్లు భేటీ అయినట్టు సమాచారం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు కవిత కొత్త పార్టీకి సంబంధించి కీలక సమావేశాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో భాగంగా ప్రశాంత్ కిశోర్ కవితతో భేటీ అయ్యారని కవిత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
గైడెన్స్ ఇవ్వబోతున్నారా?
ప్రశాంత్ కిశోర్ నేరుగా రాజకీయ పార్టీ కోసం పనిచేయకపోయినా తన గైడెన్స్ మాత్రం కొనసాగించబోతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీకి సైతం ఆయన రాజకీయ సలహాలు ఇస్తున్నట్టు సమాచారం. కొంతకాలం క్రితం ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. అదే విధంగా కవితకు కూడా ప్రశాంత్ కిశోర్ రాజకీయ సలహాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రశాంత్ కిశోర్‌కు దేశంలోనే అత్యంత సక్సెస్ ఫుల్ రాజకీయ వ్యూహకర్తగా పేరుంది. వైసీపీ అధినేత జగన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వంటి ప్రముఖ నేతలకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేసి వారిని విజయతీరాల వైపు నడిపించారు. ఆయన మొదట్లో బీజేపీ కోసం కూడా పనిచేశారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కవితకు ప్రశాంత్ కిశోర్ గైడెన్స్ ఇవ్వబోతున్నారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఆయన సలహాలతో కవిత తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం చూపించబోతున్నారు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను తనవైపునకు తిప్పుకొని ఒక్కతాటిపైకి నడిపించగలరా? తెలంగాణ రాజకీయాల్లో సక్సెస్ అవుతారా? అన్నది వేచి చూడాలి.


