కలం, తెలంగాణ బ్యూరో : జిల్లాల పునర్ వ్యవస్థీకరణ (District Reorganisation)కు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతున్నది. ఇందుకోసం రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వంలో జిల్లాల ఏర్పాటు శాస్త్రీయబద్ధంగా జరగలేదని, ఈ కారణంగా రెవెన్యూ, పోలీసు విధుల్లో ఇబ్బందులు నెలకొన్నట్లు ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఈ తప్పులను సరిదిద్దేందుకు ఇకపైన సైంటిఫిక్ పద్ధతిలో పునర్ వ్యవస్థీకరణ చేయడం ఉత్తమమని భావించింది. ఈ విషయాన్ని మేడారంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఏకాభిప్రాయం వ్యక్తమై ఆమోదం లభించింది. ఈ ప్రక్రియపై తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశమై అధికారులు, సంబంధిత మంత్రులు చర్చించి యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు. ఆ తర్వాత మరింత స్పష్టత రానున్నది.
మున్సిపల్ ఎన్నికలకూ క్యాబినెట్ ఓకే :
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి రెండో వారంలోపే ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నది. ఆ తర్వాత రాష్ట్ర బడ్జెట్ కసరత్తు ప్రారంభం కానున్నందున దానికి ముందే ఎలక్షన్ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నది. ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ షెడ్యూలును విడుదల చేయనున్నది. మేడారం వేదికగా రెండు గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇకపైన జాతర కోసం మేడారంలో శాశ్వత స్థాయిలో భవనాల నిర్మాణాన్ని చేపట్టాలనే నిర్ణయం జరిగింది. పొట్లపాడు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సైతం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గోదావరి పుష్కరాలపైనా చర్చించిన క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అవసరమైతే కేంద్రం నుంచి నిధులను తెప్పించుకోవాలని భావిస్తున్నది.
Read Also: హార్వర్డ్ వర్సిటీ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌కు సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Sharechat


