కలం, జనగామ : రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీసీ అధికారం తథ్యమని పట్టభద్రుల ఎమ్మెల్సీ, రాజ్యాధికార పార్టీ (TRP) వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) అన్నారు. ఆదివారం జనగామలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సెవెల్లి సంపత్, కల్నల్ డాక్టర్ బిక్షపతి అధ్యక్షతన నిర్వహించిన బీసీల సభలో పాల్గొన్న మల్లన్న ప్రభుత్వంపై అధికార పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీ సభకు రావొద్దని ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, యశ్వవిని రెడ్డి చెప్పడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. జనగామ జిల్లాలో ఉన్న సుమారు రెండు వేల ఆటోలకు ప్రభుత్వం చలాన్లు వేయించడం బీసీలపై దాడిగా అభివర్ణించారు. గొర్ల సంఖ్యపై మాట్లాడిన ప్రభుత్వం, గొల్ల కురుమలు ఎంత మంది ఉన్నారో చెప్పలేదని విమర్శించారు.
జిల్లాలో లక్ష నలభై వేల మంది కంట్రోల్ బియ్యం తింటున్నారని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయకపోవడం మోసమని ఆరోపించారు. బీసీల ఓట్లతో గెలిచిన నాయకులు, ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వనప్పుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీసీల సొమ్ముతో అధికారాన్ని అనుభవిస్తూ మళ్లీ బీసీలపైనే పెత్తనం చెలాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దమ్ముంటే బీసీల ఓట్లు వద్దని ఏ రాజకీయ నాయకుడైనా చెప్పాలని సవాల్ విసిరారు. బీసీల ఓట్లు బీసీలకే వేస్తే ఇక ఇతరుల ఓట్లు అవసరం లేదన్నారు.
బీసీలు టికెట్లు అడుక్కోవాల్సిన అవసరం లేదని, బీసీలే టికెట్లు ఇచ్చే స్థాయికి రావాలని పిలుపునిచ్చారు. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ జేఏసీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం బీసీల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి, కేవలం రూ.11 వేల కోట్లు కేటాయించి అందులో రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు. బీసీలకు రాజ్యాధికారం తీసుకురావడమే తన లక్ష్యమని, పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) స్పష్టం చేశారు.
Read Also: రంగారెడ్డిని సగం ఎంఐఎంకు అప్పజెప్పేలా కుట్ర : ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి
Follow Us On: X(Twitter)


