కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండలంలో చేపలు, చికెన్, మాంసం విక్రయ దుకాణాలపై తూనికలు, కొలతలు శాఖ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ధృవీకరణ లేని తూకపు యంత్రాలు వినియోగించడం, సరైన ముద్రలు లేకుండా తూకాలు నిర్వహించడం, కొలతల్లో తేడాలు చూపించడం వంటి అక్రమాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఉల్లంఘనలపై మొత్తం 12 కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. తూనికలు కొలతల చట్టాన్ని ఉల్లంఘించిన వ్యాపారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులను మోసగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
కాబట్టి వ్యాపారులు తప్పనిసరిగా ప్రభుత్వ ధృవీకరణ పొందిన తూకపు యంత్రాలనే వినియోగించాలని, నిర్ణీత కాలవ్యవధిలో పునఃధృవీకరణ చేయించుకోవాలని అధికారులు సూచించారు. వినియోగదారులు కూడా తూకాల్లో అక్రమాలు గమనించినట్లయితే జిల్లా తూనికలు కొలతలు శాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని కోరారు. భవిష్యత్తులో కూడా జిల్లాలోని సంతలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తూనికలు కొలతలు శాఖ అధికారి మనోహర్ (Manohar) తెలిపారు.
Read Also: పేదలను హింసిస్తున్న పోలీస్ స్టేషన్లు: మందకృష్ణ
Follow Us On : WhatsApp


