కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమంతా ద్రోహాలతో నిండి ఉందని, అడుగడుగునా వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలే మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ద్రోహ బుద్ధి డీఎన్ఏలోనే ఉందని. సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడన్నారు. ఎన్టీఆర్ ద్వేషించిన కాంగ్రెస్ పార్టీలో చేరి, నమ్మిన టీడీపీకి వెన్నుపోటు పొడిచిన ద్రోహిగా రేవంత్ రెడ్డిని వర్ణించారు.
సీఎం పదవి అనుభవిస్తూనే కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వంచిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. బనకచర్ల లాంటి ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్ర ప్రయోజనాలకు పని చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాడని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుంటే, రేవంత్ మాత్రం బీజేపీ-టీడీపీ కూటమిని భుజాన మోస్తున్నట్లు బహిరంగంగా అభిమానం చూపిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ జెండా గద్దెలను కూల్చాలని ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునివ్వడం రాష్ట్ర శాంతిభద్రతలకు ప్రత్యక్ష ముప్పు అని అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా హింసను ప్రేరేపిస్తుంటే రాష్ట్ర డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాజ్యాంగం అమలవుతోందా లేక రేవంత్ రాజ్యాంగం నడుస్తోందా అని Harish Rao అనుమానం వ్యక్తం చేశారు.


