కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నాడు. తాను నోబెల్ శాంతి బహుమతి పొందాలనే కోరికను నెరవేర్చుకున్నాడు. ఈ బహుమతి ట్రంప్‌కు దక్కింది మాత్రం కాదు. వెనిజులా (Venezuela) ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు లభించిన నోబెల్ ప్రైజ్‌ను ట్రంప్‌కు అందించారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. స్వేచ్ఛ కోసం ట్రంప్ చూపిన ప్రత్యేక నిబద్ధతకు గుర్తుగా ఈ పురస్కారం ఇచ్చానని చెప్పారు. ఈ మేరకు వైట్ హౌస్‌లో ట్రంప్‌తో భేటీ అయ్యారు.
మచాడోపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. “ఆమె అద్భుతమైన మహిళ. ఆమెకు దక్కిన నోబెల్ బహుమతిని నాకిచ్చింది. పరస్పర గౌరవానికి అద్భుతమైన సంకేతం. ధన్యవాదాలు మాచాడో!” సోషల్ మీడియాలో స్పందించారు. ట్రంప్‌కు బహుమతిని ఇవ్వకముందే మాచాడో వేరొకరికి బహుమతిని అంకితం చేసింది. ఈ నేపథ్యంలో మాచాడో తీరుపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ‘నోబెల్ బహుమతి ప్రకటించిన తర్వాత రద్దు చేయడం, పంచుకోవడం, లేదా ఇతరులకు బదిలీ చేయడం సాధ్యం కాదు’ అని నోబెల్ కమిటీ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఎన్నోసార్లు ట్రంప్ (Donald Trump) నోబెల్ ఫ్రైజ్ కావాలని బహిరంగంగా ప్రస్తావించాడు. తనకు బహుమతి దక్కకపోతే అది అమెరికాకు “అవమానం” అని తేల్చి చెప్పిన సందర్భాలున్నాయి. ఆరు, ఏడు యుద్ధాలను పెద్దన్న ప్రాతలో తాను పరిష్కరించినట్టు ట్రంప్ చెప్పాడు. కానీ ట్రంప్ “అమెరికా ఫస్ట్”, ఇతర విధానాల కారణంగా నోబెల్ శాంతి బహుమతి దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. తాజా పరిణామంతోనైనా ట్రంప్ ఆనందిస్తాడా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.


