కలం, వెబ్‌డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్‌లో మరో ఉత్కంఠ భరిత పోరు. ఆదివారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) మహిళల మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు హోరాహోరీగా సాగింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జెయింట్స్.. సోఫీ డివైన్ (95; 42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌కు తోడు, కెప్టెన్ ఆష్లే గార్డెనర్(49; 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు తోడవడంతో సరిగ్గా 20 ఓవర్లకు 209 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ జట్టులో నందని శర్మ 5 వికెట్లు పడగొట్టింది. షినెల్లీ హెన్రీ, తెలుగమ్మాయి శ్రీ చరణి చెరో రెండు వికెట్లు, షఫాలీ వర్మ 1 వికెట్ తీశారు.
ఛేదనలో ఢిల్లీ సైతం ధాటిగా ఆడింది. ఓపెనర్ షఫాలీ వర్మ(14; 12 బంతుల్లో 2 ఫోర్లు) త్వరగానే అవుటైనప్పటికీ మరో ఓపెనర్ లిజెల్లీ లీ (86; 54 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. లారా వోల్వార్ట్(77; 38 బంతుల్లో 9 ఫోర్లు, 3సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్(15; 9 బంతుల్లో 2 ఫోర్లు) మ్యాచ్ ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లారు. ఆఖరి ఓవర్లో విజయానికి 7 పరుగులు అవసరం కాగా.. లారా, వోల్వార్ట్లను ఔట్ చేసి సోఫీ డివైన్ తన జట్టు (Gujarat Giants) కు విజయం కట్టబెట్టింది.


