ఫీజు బకాయిలపై శ్రీధర్‌ రాజు పోరుబాట

కలం, కరీంనగర్‌ : బీసీ విద్యార్థుల సమస్యల (BC Students Issues) పరిష్కారం కోసం గత మూడు దశాబ్దాలకు పైగా ఉద్యమం చేస్తున్నానని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ పెద్ది శ్రీధర్‌ రాజు అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతి సందర్భంగా యూనివర్సిటీ ముందు ఉన్న ఫూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు విడుదల చేయడం లేదని విమర్శించారు. పేద విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని, సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కళాశాలల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజుల బకాయిలను మూడు నెలలకు ఒకసారి విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఈ హామీతో బీసీ సంఘాలు, బీసీ ప్రజలు, విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని పేర్కొన్నారు. కళాశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కూడా ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమని అన్నారు.

ప్రభుత్వం బీసీల పట్ల చిన్నచూపు చూస్తోందని, అన్ని రాజకీయ పార్టీలు బీసీల గురించి మాట్లాడుతున్నా విద్యార్థుల సమస్యపై సరైన రీతిలో స్పందించడం లేదని విమర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బకాయిలు విడుదల చేయించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని బీసీ సంక్షేమ సంఘం పక్షాన కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటివరకు అనేక ఉద్యమాలు నిర్వహించి విజయం సాధించామని, అయితే ప్రస్తుత ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని అన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు. పేద విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని, వారి సమస్యల కోసం ప్రాణత్యాగానికి సైతం వెనుకాడే ప్రసక్తే లేదని శ్రీధర్‌ రాజు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>