కలం, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు శ్రీకాంతాచారిని (Srikanth Chary) స్మరించుకుంటూ అలుగునూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ కార్యక్రమం కోసం తొలగించడంపై కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు, తెలంగాణ ఉద్యమకారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ చర్యను అమరవీరుడికి జరిగిన అవమానంగా, బీఆర్ఎస్ నేతల అహంకారానికి పరాకాష్టగా అభివర్ణిస్తూ మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపు మేరకు శనివారం అలుగునూరు చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి.
నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు తరలివచ్చి శ్రీకాంతాచారి ఫ్లెక్సీ తొలగింపును తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడి జ్ఞాపకాన్ని తొలగించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అమరవీరుల త్యాగాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వారి స్మృతులను అవమానించడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. శ్రీకాంతాచారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని, ఆయన స్మారక ఫ్లెక్సీని తొలగించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను అవమానించే చర్యలను తెలంగాణ సమాజం సహించబోదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. అమరవీరుల త్యాగాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, వారి స్మృతులను కించపరిచే చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరవీరుల త్యాగాలను అవమానిస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ఆందోళన నేపథ్యంలో శ్రీకాంతాచారి ఫ్లెక్సీని తిరిగి ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు తమ నిరసనను విరమించాయి. అంతకుముందు పోలీసులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పీటీసీకి తరలించారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్, మానకొండూర్, గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు బండారి రమేష్, ద్యావ శ్రీనివాసరెడ్డి, బొడ్డు సునీల్, మానకొండూర్ ఏఎంసీ చైర్మన్ రేవల్లి రాజలింగం, నుస్తులాపూర్, పోరండ్ల పీఏసీఎస్ చైర్మన్లు గోపు తిరుపతి రెడ్డి, మోరపల్లి రమణారెడ్డి, డివిజన్ పార్టీ అధ్యక్షులు కంది అశోక్ రెడ్డి, బండి మల్లేశం గౌడ్, పార్టీ జిల్లా నాయకులు నందగిరి రవీంద్ర చారి, ముసుకు ఉపేందర్ రెడ్డి, కంది లక్ష్మీనారాయణ రెడ్డి, శ్రీగిరి రంగారావు, చిన్నబోయిన రవి, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, రామిడి తిరుమలరెడ్డి, గూడ కొమరయ్య, కుంబాల లింగయ్య, సముద్రాల లక్ష్మణ్ కుమార్, తూర్తి అరవింద్, అట్లా అనిల్ కుమార్, పోతుగంటి శ్రీనివాస్, రావుల శ్రీనివాస్, రెడ్డి గాని రాజు, కే.లింగారెడ్డి, వేగోలపు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

