కలం, వెబ్ డెస్క్: డీ లిమిటేషన్ బిల్లు (Delimitation Bill)కు మద్దతు తెలుపుతున్నట్లు ఎన్సీపీ(ఎస్సీపీ) అధినేత శరద్ పవార్ పరోక్ష సంకేతాలు ఇవ్వడంపై మహారాష్ట్ర కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ’85 ఏళ్ల వయస్సులో శరద్ పవార్‌ను రాజ్యసభకు పంపించేందుకు కాంగ్రెస్ పార్టీ చివరి వరకు అండగా నిలబడింది. రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు పవార్ పార్టీకి కేవలం 10 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. రాజ్యసభ సీటు గెలవాలంటే 36 మంది అభ్యర్థుల ఓట్లు కావాలి. కాంగ్రెస్ 16, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) 20 మంది ఎమ్మెల్యేలు కలిసి మద్దతు ఇచ్చాం. మహా వికాస్ అఘాడీ కూటమి శరద్ పవార్‌ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేసింది. కాంగ్రెస్ పార్టీ తన రాజ్యసభ సీటును త్యాగం చేసి మరీ పవార్‌ను రాజ్యసభకు వెళ్లేలా చేస్తే.. శరద్ పవార్, సుప్రియా సూలే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు సిద్ధమయ్యారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కూటమి సమావేశానికి గైర్హాజరు..
డీ లిమిటేషన్ బిల్లుపై చర్చించేందుకు ఇండియా కూటమి ఈ రోజు ఢిల్లీలో సమావేశం కాబోతుంది. ఖర్గే నివాసంలో జరిగే ఈ భేటీలో రాహుల్ గాంధీ సహా కూటమి నేతలు పాల్గొనబోతున్నారు. దీనికి ఎన్సీపీ(ఎస్సీపీ) పార్టీ తరఫున సుప్రియా సూలే హాజరు కావాల్సి ఉన్నా.. ఆమె వెళ్లడం లేదని తెలుస్తోంది. శరద్ పవార్ అస్వస్థత కారణంగానే తాను ఢిల్లీ వెళ్లడం లేదని.. తమ పార్టీ నేతలు హాజరవుతారని చెబుతున్నారు. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకే పవార్, సుప్రియా సూలే రెడీ అయ్యారని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

