కలం, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లాడ (Tallada) మండలం మెట్టపల్లి సమీపంలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు బలంగా ఢీకొట్టింది (Bus Accident). హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో సుమారు 15 మందికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్, క్లీనర్ తో సహా నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్పందించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ల ద్వారా చికిత్స నిమిత్తం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం కారణంగా గ్రీన్ ఫీల్డ్ హైవేపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ధ్వంసమైన వాహనాలను పక్కకు తొలగించి వాహనాలను పునరుద్ధరించారు.

