కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ప్రముఖ బావర్చి హోటల్‌లో జరిగిన దాడి ఘటన (Bawarchi Hotel Incident)కు సంబంధించి బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హోటల్‌లో లైట్లు ఆఫ్ చేసి తమపై దాడికి పాల్పడ్డారని, అసభ్య పదజాలంతో దూషించారని కాంగ్రెస్ నాయకులు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఈ దాడి జరిగిన సమయంలో తమ వద్ద ఉన్న సుమారు 8 నుండి 10 తులాల బంగారం కూడా అపహరణకు గురైందని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు స్పందించిన చిక్కడపల్లి పోలీసులు బీఆర్ఎస్ నేతలు మన్నె క్రిశాంక్, ముఠా జైసింహ, జగన్ పాటిమీది, దినేశ్ చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డి, హరీష్ రెడ్డితో పాటు మరికొందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

