‘రైతు భరోసా’ నిధులివ్వండి.. కేంద్రానికి రిక్వెస్ట్!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రబీ సీజన్ రైతు భరోసా పథకానికి (Rythu Bharosa Scheme) అవసరమైన నిధుల్లేవా? సొంత ఖజానా నుంచి ఇవ్వొద్దని భావిస్తున్నదా? కేంద్రం నుంచి ఆశిస్తున్న ‘కరువు సాయం’ ద్వారా సమకూర్చుకోవాలని అనుకుంటున్నదా? ఇలాంటి ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదిక ‘ఔను’ అనే సమాధానాన్నే ఇస్తున్నది. ఏటా రైతు భరోసా నిధులను రాష్ట్ర సర్కార్ తన సొంత వనరుల నుంచే సమకూరుస్తూ ఉన్నది. గడచిన రెండేండ్లలో రబీ సీజన్‌కు రైతుభరోసా సాయం రైతులకు అందలేదు. ఈసారి ఎల్‌ నినో కరువు కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు ప్రభుత్వం నుంచి ఈ సాయాన్ని ఆశిస్తున్నారు.

కేంద్రం ద్వారా సమకూర్చుకునేలా..

ఒకవైపు కరువు సాయం, మరోవైపు రైతు భరోసా ఇవ్వకపోతే రైతుల్లో అలజడి మొదలవుతుందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే కరువు సాయం ద్వారా సమకూర్చుకోవాలని ఆలోచిస్తున్నది. రాష్ట్రంలోని 365 కరువు మండలాల ప్రకటన, కేంద్రం నుంచి సుమారు రూ.20 వేల కోట్ల సాయం కావాలని కోరుతూ సమర్పించిన నివేదికలో రైతు భరోసా అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఇవి కాక స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్‌ (ఎస్డీఆర్ఎఫ్)లో రూ.2,251.60 కోట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొని వాటిని కూడా వినియోగించుకోవాలన్నది రాష్ట్ర సర్కార్ ఆలోచన.

రూ.8,750 కోట్ల ప్రతిపాదనలు..

కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్న రూ.20 వేల కోట్ల సాయంలో రైతు భరోసా అవసరాల కోసం రూ.8,750 కోట్లు కూడా ఉన్నాయి. ఎల్‌ నినో కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని సుమారు రూ.వెయ్యి కోట్లుగానే పేర్కొన్న ప్రభుత్వం రైతు భరోసాను కేంద్ర సాయంలో పేర్కొనడం గమనార్హం. ఎప్పుడూ రాష్ట్రం తన సొంత నిధులను ఈ స్కీమ్‌కోసం వెచ్చిస్తున్నా ఈసారి మాత్రం కేంద్ర సాయంపై ఆధారపడడం అనూహ్య పరిణామం.

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే ఈ స్కీమ్‌కు కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా.. అనే సందేహాలూ లేకపోలేదు. కేంద్రం ఎలాగూ ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన’ స్కీమ్‌ను రైతులకు ఆర్థిక సాయం ఇవ్వడానికి అమలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ స్కీమ్‌ను కేంద్రం నుంచి అందే కరువుసాయం జాబితాలో చేర్చడంతో ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది చర్చనీయాంశం. రాష్ట్రంలో పర్యటనకు వస్తున్న కేంద్ర బృందాలు ఎలా రియాక్ట్ అవుతాయనేది ఆసక్తికరం.

4 విభాగాల తరఫున సాయం రిక్వెస్ట్..

రాష్ట్రంలోని ఎల్‌ నినో కరువు పరిస్థితులకు మొత్తం 4 విభాగాల తరఫునన ఎంతెంత సాయం అవసరమో ఆ నివేదికలో బ్రేకప్ డీటెయిల్స్ ప్రకటించింది. వ్యవసాయ, పశుసంవర్ధక, గ్రామీణ తాగునీరు, గ్రామీణాభివృద్ధి విభాగాల నుంచి వేర్వేరు అవసరాల కోసం విడివిడిగానే లెక్కలు చూపి రిక్వెస్ట్ చేసింది. ఈ ఏడాది వర్షాకాలం నుంచి మొదలైన ఎల్‌ నినో ప్రభావం వచ్చే ఏడాది సమ్మర్ ముగిసేంత వరకూ కొనసాగనున్నట్లు పేర్కొన్నది. ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై, ఎమర్జెన్సీ పంపింగ్, విద్యుత్‌ను సమకూర్చుకోవడం, పంటలకు ఉపశమనం కలిగించడం, పశుగ్రాసాన్ని సిద్ధం చేసుకోవడం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం.. వీటన్నింటినీ చేపట్టాల్సి ఉన్నదని ఆ నివేదికలో ప్రభుత్వం పేర్కొన్నది.

ముగిసిన ఖరీఫ్ సీజన్‌కు ప్రభుత్వం నుంచి ‘రైతుభరోసా’ సాయం అందినా రబీ సీజన్‌కు వస్తుందో.. లేదోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర సాయం జాబితాలో రాష్ట్రం ఈ పేరుతో రూ.8,750 కోట్ల సాయాన్ని ఆశిస్తుండడం సరికొత్త సందేహాలకు తావిచ్చినట్లయింది. ఒకవైపు పంట నష్టానికి సాయం, మరోవైపు రబీ సీజన్ రైతుభరోసాపై ఆశలు పెట్టుకున్న రైతులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకం కానున్నది.

కేంద్రం నుంచి రాష్ట్రం ఆశిస్తున్న సాయం వివరాలు..

పంట నష్టానికి సాయం:                               రూ.1000 కోట్లు
రైతుభరోసా కోసం:                                     రూ.8,750 కోట్లు
పశుగ్రాసం, పశువుల క్యాంపులకు:                   రూ.112 కోట్లు
పశువుల వైద్య సంరక్షణకు:                          రూ.73 కోట్లు
మిషన్ భగీరథ ఇంటర్‌వెన్షన్‌కు:                     రూ.1,500 కోట్లు
132 పట్టణ స్థానిక సంస్థల్లో కంటింజెన్సీ ప్లాన్‌కు: రూ.500 కోట్లు
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు:               రూ.250 కోట్లు
గ్రామీణ జీ-రామ్-జీ కూలీల వేతనాలకు:          రూ.5,850 కోట్లు
అదనపు 50 రోజుల ఉపాధి అవసరాలకు:        రూ.2,000 కోట్లు
మొత్తం: రూ.20,035 కోట్లు

విభాగాల వారీగా..

వ్యవసాయం:              రూ.9,750 కోట్లు
పశు సంవర్ధకం:           రూ.185 కోట్లు
తాగునీటి అవసరాలకు: రూ.2,250 కోట్లు
గ్రామీణాభివృద్ధి:          రూ.7,850 కోట్లు
మొత్తం:                    రూ.20,035 కోట్లు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>