హస్తం పార్టీ కొత్త వ్యూహం.. సంక్రాంతి నుంచి ప్రజాక్షేత్రంలోకి!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ (Telangana Congress) అధిష్టానం ఇప్పటి నుంచే కార్యాచరణకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా పార్టీ నేతలంతా ఇకపై ప్రజాక్షేత్రంలోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి జూన్‌ వరకు ఆరు నెలల పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు, సీనియర్‌ నాయకులంతా క్షేత్రస్థాయిలో పర్యటించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

డిసెంబర్‌ 7 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. మిగిలిన రెండేళ్లలో పార్టీని మరింత బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఏఐసీసీ వ్యూహాలు రచిస్తున్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయాలని భావిస్తున్నది.

ఆరు నెలలు.. ప్రజల్లోనే నేతలు

సంక్రాంతి తర్వాత నుంచి జూన్‌ వరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా నియోజకవర్గాలు, మండలాల వారీగా పర్యటించనున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నేరుగా వారిని కలుసుకోవడం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, స్థానిక సమస్యలను తెలుసుకోవడం ఈ పర్యటనల ప్రధాన ఉద్దేశం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల వాతావరణం పెంపొందించేలా నేతలకు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్ను పార్టీ సిద్ధం చేయనుంది. రాష్ట్రానికి కొత్త ఏఐసీసీ ఇన్చార్జిగా నియమితులైన బీఎం సందీప్‌ ఈ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.

డిసెంబర్‌ 4న సందీప్‌ రాక

కొత్త ఇన్చార్జి బీఎం సందీప్‌ ఇప్పటికే గాంధీభవన్లో వరుస సమావేశాలతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పనితీరు, నేతల మధ్య ఉన్న విభేదాలపై ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. డిసెంబర్‌ 4న ఆయన మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలోనూ పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీలో అసమ్మతి, అసంతృప్తిని తగ్గించి నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడంపై సందీప్‌ ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తున్నది. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే వారు, క్రమశిక్షణను ఉల్లంఘించే నేతలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>