ఎన్డీఏతోనే ప్ర‌జాస్వామ్య సంస్థ‌లు బ‌లోపేతం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్రతి పౌరుడి గళం వినిపించినప్పుడే బలమైన ప్రజాస్వామ్యం నిర్మితమవుతుందని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. నవంబర్ 30న జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రతిపాదిత డీలిమిటేషన్ సంస్కరణలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు క్రియాశీల పాత్రతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్య సంస్థలను మరింత బలోపేతం చేసే సంస్కరణలను ముందుకు తీసుకెళ్తోందని ప్రశంసించారు.

2051 వరకు ప్రస్తుత దామాషా ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తూనే, అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచాలన్న ప్రతిపాదన దేశ ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని విస్తరించే కీలక అడుగు అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయాలను ప్ర‌స్తావించారు. పార్లమెంట్‌లో వాటి దామాషా వాటాకు రక్షణ కల్పించేలా ఈ విధానం రూపొందించబడిందని, ఇది సహకార సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనమని తెలిపారు. అలాగే లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదన చట్టసభల్లో, నిర్ణయాత్మక ప్రక్రియల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుందని పేర్కొన్నారు.

ఈ కీలక జాతీయ సంస్కరణకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, భాగస్వాములు రాజకీయ విభేదాలకు అతీతంగా ఏకమై ఈ చొరవకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ప్రతి రాష్ట్రానికి గౌరవప్రదమైన అవ‌కాశం, సమాజంలోని ప్రతి వర్గానికి భాగస్వామ్యం లభించేలా మరింత బలమైన పార్లమెంట్ దిశగా అందరం కలిసి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>