కలం, ఖమ్మం బ్యూరో: గిరిజన విద్యార్థిని, విద్యార్థులు ఆటల మైదానంలోనూ తమ సత్తా సాగాలని .. రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ (ITDA PO Rahul) పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి, తమలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి పతకాలు సాధించడం ద్వారా పాఠశాలలకు, ఉమ్మడి జిల్లా (Khammam)కు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
శుక్రవారం కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా జోనల్ స్థాయి ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల అండర్–17 బాలబాలికల క్రీడా పోటీలు రాష్ట్రస్థాయి క్రీడల ఎంపికలను పీవో ముఖ్యఅతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. దీంతో కిన్నెరసాని క్రీడా ప్రాంగణంలో జోనల్ స్థాయి క్రీడా సందడి నెలకొంది.
ఈ సందర్భంగా బి. రాహుల్ మాట్లాడుతూ.. క్రీడలపై ఆసక్తి పెంచుకుని క్రమశిక్షణతో నిరంతరం సాధన చేయాలని విద్యార్థులకు సూచించారు. క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. మొదటి రోజు జరిగిన అండర్–17 విభాగ పోటీల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్, క్యారమ్స్, చెస్, టెన్నికాయిట్, ఆర్చరీ అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలబాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా జోనల్ స్థాయి అండర్–14 బాలబాలికల క్రీడా ఎంపికలు నిర్వహిస్తామని వివరించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ చందన, ఖమ్మం ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఫిరంగి, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు, ఏటీడీవోలు చంద్రమోహన్, భారతి, రాధమ్మ, రమేష్, ఖమ్మం ఏసీఎంవో రాములు, ఏఎస్వోలు వెంకట్ నారాయణ, నాగేశ్వరరావు, రాంబాబు, శంకర్రావు, హెచ్ఎం ఎన్. చందు, పీడీలు బాలసుబ్రమణ్యం, నగేష్, సైదులు, మోతిలాల్, హరికృష్ణ, వెంకన్న, శిరోమణి, ప్రత్యూష, నాగమణి, కోచ్లు నాగరాజు, ప్రసాద్, హత్తిరామ్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

