దీక్షా దివస్ సభకు పెద్దపల్లి నుంచి ప్రజలు భారీగా తరలిరావాలి: దాసరి మనోహర్ రెడ్డి

కలం, కరీంనగర్‌ : కరీంనగర్ సమీపంలోని అలుగునూరులో నిర్వహించనున్న ‘దీక్షా దివస్ స్ఫూర్తి’ బహిరంగ సభకు (Deeksha Divas) పెద్దపల్లి నియోజకవర్గం నుండి ప్రజలు, యువత, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. దీక్షా దివస్ తెలంగాణ చరిత్రలో మలుపు తిప్పిన చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. “కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో కేసీఆర్ చేసిన త్యాగఫలితంతోనే పార్లమెంటులో తెలంగాణ ప్రక్రియ ప్రారంభమై, 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ఆ ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.

సభకు తరలివచ్చే వారి కోసం పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి ఒక్కో బస్సు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. గ్రామాల్లో యువకులు, నాయకుల పేర్లు (పేరు, తండ్రి పేరు, సెల్ నంబర్) బస్సు ఇన్‌ఛార్జ్‌ల వివరాలను ఇప్పటికే నమోదు చేశామని, ఎక్కడైనా ఇంకా మిగిలి ఉంటే ఈరోజు సాయంత్రంలోపు పంపించి ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

ఆదివారం జరిగే ఈ సభ కోసం ప్రతి గ్రామం నుండి మధ్యాహ్నం 1:00 గంటకు బయలుదేరి, 3:30 నుండి 4:00 గంటల లోపు సభాస్థలికి చేరుకోవాలని తెలిపారు. సభ సాయంత్రం 5:30 నుండి 6:00 గంటల లోపు ముగిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలుగా, యువకులుగా ప్రతి ఒక్కరూ సకాలంలో సభకు చేరుకుని, నాయకుల సందేశాలను అందుకుని సభను విజయవంతం చేయాలని దాసరి మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, నాయకులు సలేంద్ర రాములు, పూదరి చంద్రశేఖర్, కారిపాకల సంపత్, నాగరాజు, పల్లె మధు, నాయకులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>