తెలంగాణ ఉద్యమ చరిత్రను యువతకు తెలియజేయాలి : బీఆర్‌ఎస్‌ నేతలు

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీఆర్‌ఎస్‌ నాయకులు (BRS Leaders) పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిందన్నారు. విద్యార్థులు, యువత చేసిన పోరాటాలు, అమరవీరుల త్యాగాలను నేటి తరానికి వివరించాలని సూచించారు.

విద్యార్థుల్లో రాజకీయ అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈనెల 29న నిర్వహించే దీక్షా దివస్‌ (Deeksha Divas) సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌ చింతకుంటలోని పార్టీ కార్యలయంలో బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు.

దీనికి మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, కోరుట్ల ఎమ్మెల్యే, దీక్షా దివస్‌ సభ ఇన్‌చార్జి కల్వకుంట్ల సంజయ్‌, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్‌, బాల్క సుమన్‌, బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్‌ జిల్లా కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు.

ఉద్యమానికి కరీంనగర్‌ కేంద్రబిందువు

2006లో కేసీఆర్‌ ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా చాటారని నాయకులు తెలిపారు. 2009 నవంబరు 29న కరీంనగర్‌ నుంచి సిద్ధిపేటకు బయలుదేరిన ఆయనను అలుగునూరు వద్ద అరెస్టు చేశారని పేర్కొన్నారు. అనంతరం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చిందన్నారు. ఉద్యమ ఉధృతిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించిందని వివరించారు. నవంబరు 29 లేకుంటే డిసెంబరు 9 లేదని, డిసెంబరు 9 లేకుంటే జూన్‌ 2 లేదని వ్యాఖ్యానించారు.

వాస్తవ చరిత్రను యువతకు చెప్పాలి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన రాజకీయ పోరాటం, ఎదురైన సవాళ్లు, విద్యార్థుల ఉద్యమాలు, అమరవీరుల త్యాగాల గురించి నేటి తరానికి వివరించాల్సిన అవసరం ఉందని నాయకులు అన్నారు. ఉద్యమ సమయంలో చిన్న వయసులో ఉన్న ప్రస్తుత విద్యార్థులకు అప్పటి పరిస్థితులు తెలియజేయాలని సూచించారు. ఉద్యమ చరిత్ర వక్రీకరణకు గురికాకుండా వాస్తవాలను భావితరాలకు అందించాలన్నారు. ఇందుకోసం విద్యార్థులకు ప్రత్యేక రాజకీయ అవగాహన, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

చదువుతోపాటు సామాజిక అవగాహన

విద్యార్థులు చదువుతోపాటు సమాజం, రాజకీయ పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలని నాయకులు సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల నిర్ణయాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై విశ్లేషణాత్మక దృక్పథం కలిగి ఉండాలన్నారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించే శక్తి విద్యార్థి లోకానికి ఉందని పేర్కొన్నారు. గతంలో విద్యార్థుల పోరాటాల వల్ల ప్రభుత్వాలు తమ నిర్ణయాలను వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.

ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలి

తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక ఎన్నో పోరాటాలు, త్యాగాలు ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు. కేసీఆర్‌ నాయకత్వం, విద్యార్థుల పాత్ర, కరీంనగర్‌ జిల్లా ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేయాలని అన్నారు. దీక్షా దివస్‌ కార్యక్రమాల ద్వారా ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ముఖ్యంగా విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, రాష్ట్ర BRSV అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ , మాజీ TSTSC చైర్మన్ చిరుమిల్ల రాకేష్ , మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ , వివిధ జిల్లా ల కోఆర్డినేటర్ లు దావ మధుసూదన్ రెడ్డి , రామడుగు రాజేష్ , కొయ్యడ సతీష్ గౌడ్ , బందారపు అజయ్ గౌడ్, సబ్బని హరీష్ , సూరారం పరుశరామ్ , చుక్క శ్రీనివాస్ , కిరణ్ గౌడ్ , బొంకూరి మోహన్ , గవ్వ వంశీధర్ రెడ్డి , వడ్లకొండ పరశురామ్ , గంగాధర చందు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, విద్యార్థి విభాగం ప్రతినిధులు, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>