కలం, వెబ్ డెస్క్: వేరే కులానికి చెందిన మహిళను ప్రేమించాడనే కారణంతో ఓ కన్నతల్లి ఘాతుకానికి ఒడిగట్టింది. ఇంటి వరండాలో నిద్రిస్తున్న కొడుకును కర్రతో కొట్టి హత్య చేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
తుమకూరు జిల్లా జక్కెనహళ్లి గ్రామానికి చెందిన ముత్తురాజ్ (35) బెంగళూరులోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వేరే కులానికి చెందిన ఓ మహిళను ప్రేమించడంతో పాటు ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, కులాంతర వివాహానికి ముత్తురాజ్ తల్లి శివమ్మ ఒప్పుకోలేదు. దీంతో తల్లీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో ఇంటికి వచ్చిన అతను వరండాలో నిద్రిస్తుండగా శివమ్మ కర్రతో దాడి చేయడంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరుసటి రోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు తన కొడుకును హత్య చేశారని కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది తల్లీ.
అయితే, సీసీటీవీ ఫుటేజీతో పాటు ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో తుమకూరు రూరల్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కొడుకును హత్య చేసింది తల్లేనని నిర్ధారించి శివమ్మను అరెస్టు చేశారు.

