కలం, మెదక్ బ్యూరో : రైతులకు వ్యవసాయ రుణాలు, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహకారం అందించడంలో బ్యాంకులు చొరవ చూపాలని ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) అన్నారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ , జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… రైతులు, నిరుద్యోగ యువత, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు ఉదారంగా రుణాలు అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా బ్యాంకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, బ్యాంకు మేనేజర్లతో కలిసి జిల్లాలో బ్యాంకింగ్ సేవలు, రుణాల మంజూరు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై సమీక్షించారు.

