కలం, జోగులాంబ గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నారని, అందులో భాగంగా అలంపూర్ (Alampur) ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు. శుక్రవారం అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి సీతక్క గ్రామంలో పర్యటించారు.
ముందుగా మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, తదితరులు కలిసి అయిజ రహదారిలోని సిటీపాడు జంక్షన్ వద్ద రూ.3.56 కోట్ల నిధులతో చిన్న తాండ్రపాడు నుంచి పెద్ద ధన్వాడ గ్రామానికి నిర్మించనున్న బీటీ రహదారికి శంకుస్థాపన చేశారు. అలాగే వేణి సోంపురం వయా సిటీపాడు వరకు రూ.2.50 కోట్ల నిధులతో నిర్మించనున్న పీడబ్ల్యూడీ రహదారికి కూడా శంకుస్థాపన చేశారు.
అనంతరం చిన్న తాండ్రపాడు గ్రామానికి చేరుకున్న ప్రజాప్రతినిధులకు అభిమానులు ఘనంగా స్వాగతం పలకగా సామాజికవేత్త ఆనందరావు విగ్రహాన్ని అతిథులు ప్రారంభించారు. అలాగే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు అవుతున్న సందర్భంగా గ్రామ నడిబొడ్డున గ్రామానికి చెందిన ఆనాటి ఉద్యమకారులు కరణం సీతారామారావు, కరణం సుబ్బారావు, పెద్ద సుంకన్న గౌడ్ ఫోటోలతో కూడిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గ్రామంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేసి, ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. ఆనందరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన బస్సు షెల్టర్ ను ప్రారంభించి అనంతరం జరిగిన బహిరంగ సభలో వక్తలు ప్రసంగించారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అలంపూర్ (Alampur) నియోజకవర్గంలో ఒక్క రోజునే రూ.135 కోట్లకు పైగా నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గ్రామ సర్పంచ్ విజ్ఞప్తి మేరకు చిన్న తాండ్రపాడు అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తామన్నారు. పెన్షన్లు రాని వారికి మరో విడత మంజూరు చేస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున రైతులు వలస పోయే పరిస్థితులు ఉండకుండా వీబీజీ రాంజీలో ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆనందరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంపత్ కుమార్ ను, వారి కుటుంబ సభ్యులను మంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత, బోయ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రామ సర్పంచ్ మహేశ్వరమ్మ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, పీసీసీ జనరల్ సెక్రెటరీ వినోద్ కుమార్, డీసీసీ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు ప్రజా సంఘాల నేతలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read : తిరుప్పరంకుండ్రం దీపం కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
Follow Us On : WhatsApp

