కలం, హనుమకొండ: అర్హులైన మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచితంగా సహాయక ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని హనుమకొండ(Hanamkonda) జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని సాయి గార్డెన్స్‌లో అలింకో సంస్థ సహకారంతో నిర్వహించిన నిర్ధారణ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారికి వైద్య, ఇతర నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, అవసరమైన సహాయక ఉపకరణాలకు అర్హులను గుర్తిస్తున్నారు. పరీక్షల అనంతరం అర్హులకు త్వరలోనే ఉపకరణాలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శిబిరంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి పరీక్షల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, మండల ప్రత్యేక అధికారి కమలాకర్ రెడ్డి, తహసీల్దార్ రాజేష్, ఎంపీడీవో వీరేశం, సీడీపీవోలు స్వరూప, సింధురాణి, ఎఫ్ఆర్వో రవికృష్ణ, అలింకో ప్రతినిధులు పాల్గొన్నారు.

