కలం, మహబూబ్ నగర్ బ్యూరో: దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో యువతకు ఉపాధి కల్పించాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 7వ తేదీన ఏఐఎస్ఎఫ్, ఏఐఓఎఫ్ ఆధ్వర్యంలో ‘ఛలో ఢిల్లీ – పార్లమెంట్ మార్చ్’ (Parliament March) ను నిర్వహిస్తున్నట్లు ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి రాము తెలిపారు.
శుక్రవారం మహబూబ్ నగర్ పట్టణంలోని వెంకటరామిరెడ్డి భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన దేశమని, దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ నేటికీ కోట్లాది మంది యువత నిరుద్యోగ సమస్యతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు.
అదేవిధంగా, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కును పరిరక్షించాలని, సర్ పేరుతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం–2020ను ఉపసంహరించుకోవాలని, విద్యను సామాన్య విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నిరంతరం పోరాటం కొనసాగిస్తాయని తెలిపారు.
యువతకు ఉపాధి, ఉద్యోగాల నోటిఫికేషన్లు, ఓటు హక్కు పరిరక్షణ, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 7వ తేదీన ఢిల్లీలో జరిగే పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్, లక్ష్మణ్, ఏఐ ఎస్ ఎస్ జిల్లా అధ్యక్షుడు బసవరాజ్, పవన్ కుమార్ రెడ్డి, మెట్టు మహేష్ బాబు, శశి, సిద్ధార్థ, సురేందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

