కలం, నకిరేకల్: మహారాణి రుద్రమదేవి (Rani Rudrama Devi) మహిళా శక్తికి ప్రతీక అని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) కొనియాడారు. నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో వివేకానంద యువజన మండలి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాణి రుద్రమదేవి వర్ధంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. కాకతీయ సామ్రాజ్యాన్ని అత్యంత సమర్థవంతంగా పరిపాలించి, తన ధైర్యసాహసాలు, పరిపాలనా దక్షతతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వీరనారి రుద్రమదేవి అని పేర్కొన్నారు. ఆమె జీవితం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయమని తెలిపారు. రుద్రమదేవి ఆశయాలను, స్ఫూర్తిని భావితరాలకు అందించడమే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి అని ఆయన అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంజుల మాధవరెడ్డి, చందుపట్ల గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వివేకానంద యువజన మండలి సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

